మావోయిస్టు పార్టీ కంచుకోటగా భావించే ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలోకి పోలీసులు నిర్మించినట్లు ఆరోపణలు వచ్చిన ‘వ్యవస్థ’ ఒకటి భారీగానే చొచ్చుకుపోయింది. నక్సల్ కార్యకలాపాల నిరోధానికి దాదాపు 22 ఏళ్ల క్రితం తెలంగాణా పోలీసులు ఏర్పాటు చేసిన దారినే పొరుగున గల ఛత్తీస్ గఢ్ జవాన్లు అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఫలితంగా మావోయిస్టు పార్టీలో అంతర్గత హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తాజా పరిణామాలపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్, మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకనలు భిన్నంగా ఉన్నాయి. కానీ దండకారణ్యంలో ‘కోవర్ట్’ వ్యవస్థ వేళ్లూనుకోవడం కాదు, ఏకంగా బలోపేతమైనట్లు తెలుస్తోంది. ఆయా అంశాల గురించి లోతుగా తెలుసుకునే ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ పరిణామాలను ముందుగా తెలుసుకోవలసిందే.
అది 1998వ సంవత్సరం… అప్పటి పీపుల్స్ వార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ అలియాస్ ముక్కంటి వెంకటేశ్వర్లును అదే పార్టీకి చెందిన దళసభ్యుడు జడల నాగరాజు కాల్చి చంపాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం రామగిరిఖిలాపై జరిగిన ఈ ఘటన అప్పట్లో అతిపెద్ద సంచలనం. ఈ ఘటన ‘కోవర్ట్’ ఆపరేషన్ గా ప్రాచుర్యం పొందింది. తీవ్రవాద పార్టీలో పనిచేస్తున్న నక్సలైట్లను తమకు అనువుగా మల్చుకుని, వారిచేతుల్లో గల తుపాకులతోనే వారి అగ్రనేతలను కాల్చి చంపించడమే ‘కోవర్ట్’ ఆపరేషన్ కు గల అసలు భాష్యం. అంతకు ముందు కత్తుల సమ్మయ్య, సోమ్లానాయక్ ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, ఆయా ఉదంతాలకు, అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శిని జడల నాగరాజు కాల్చి చంపిన సంఘటనకు వ్యత్యాసంలో చాలా తేడా ఉంది. కత్తుల సమ్మయ్య వ్యక్తిగత కక్షతో దళసభ్యులను కాల్చి చంపాడనే ప్రచారం జరగ్గా, సోమ్లానాయక్ పార్టీ తుపాకులను అపహరించి పోలీసులకు లొంగిపోయాడు.
కానీ తుపాకీ గుళ్ల వర్షం కురిపించి, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుని హోదాలో గల నాయకున్ని కాల్చి చంపడం ద్వారా జడల నాగరాజు కలకలం సృష్టించాడు. పార్టీలో చోటుచేసుకున్న ఈ అనూహ్య సంఘటనతో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నాయకత్వం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే జరగరాని నష్టం జరిగినట్లు అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కమిటీ సభ్యుడు అనుపురం కొమురయ్య అలియాస్ ఏకే విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జడల నాగరాజు కాల్పుల ఘటన అనంతరం పీపుల్స్ వార్ సాయుధ దళాల్లో ఎన్నడూలేని అభద్రతా భావం ఏర్పడింది. గార్డు డ్యూటీలో గల సహచరుడే కాల్చివేస్తాడో, నిద్రిస్తున్నట్లు కనిపిస్తున్న మరో సభ్యుడే తుపాకీ తీసి గుళ్ల వర్షం కురిపిస్తాడో తెలియని అయోమయ, ఆందోళనకర పరిణామాలను అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వం ఎదుర్కుంది. ఈ అభద్రతా భావంలోనే జిల్లా కమిటీ సభ్యురాలు, ఉత్తర తెలంగాణా కమిటీ కార్యదర్శి సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ భార్య పద్మక్క తుపాకీ తీసి ఆరుగురు దళసభ్యులను ఏకకాలంలో చంపేసిన ఘటన మరో సంచలనానికి దారి తీసింది. ‘కోవర్టు’లనే అనుమానంతో ప్రస్తుత సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమళ్ల అడవుల్లో పద్మక్క ఈ ఘటనకు పాల్పడ్డారు.
జడల నాగరాజు ‘కోవర్ట్’ ఆపరేషన్ ఘటన సాయుధ నక్సల్ దళాల్లో సృష్టించిన అభద్రతా భావానికి ఈ సంఘటన ఉదాహరణ మాత్రమే. అనంతర పరిణామాల్లో పోలీసుల దూకుడు చర్యలతో ఉమ్మడి రాష్ట్రంలో పీపుల్స్ వార్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అనంతర పరిణామాల్లో తెలంగాణాకు చెందిన అనేక మంది నక్సల్ అగ్రనేతలు ఛత్తీస్ గఢ్ అడవుల్లోని దండకారణ్యంలో షెల్టర్ తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేయడం, కోవర్ట్ ఆపరేషన్ల నిర్వహణ వంటి చర్యల కారణంగా గడచిన 15 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత ప్రత్యేక తెలంగాణాలో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన పీపుల్స్ వార్ నక్సలైట్ల ఉనికి లేకుండాపోయిందనే వాదన కూడా ఉంది.
దశాబ్ధాల క్రితంనాటి అప్పటి ఈ ఘటన ప్రస్తావన ఇప్పుడెందుకంటే… అచ్చంగా ఇటువంటి దృశ్యమే పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో ప్రస్తుతం సాక్షాత్కరిస్తోంది. విభేదాల కారణంగా మావోయిస్టు పార్టీ నక్సలైట్లు పరస్పరం కాల్చుకుంటున్నారని, సహచరులను దారుణంగా హత్య చేస్తున్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. డివిజనల్ కమిటీ సభ్యుడు మొడియం విజ్జాలు సహా మొత్తం ఆరుగురుర సహచరులను మావోయిస్టు పార్టీ నక్సలైట్లే హత్య చేసుకున్నారని ఆయన వెల్లడించారు. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను హత్య చేస్తున్న ఘటనలపై మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయని, అందువల్లే ఈ హత్యలు జరిగాయని బస్తర్ ఐజీ చేసిన ప్రకటన సారాంశం.
ఆయా హత్యోదంతాలపై మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో నిన్న ఓ సంచలన ప్రకటన వెలువడింది. ఈ విషయంలో బస్తర్ పోలీసులు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, శిక్షకు గురైనా వాళ్లంతా పార్టీ ద్రోహులను ఆయన పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలతో బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతంలో 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులను, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న ఎనిమిది మంది సహా మొత్తం 25 మందిని గుర్తించి తామే ప్రజాకోర్టులో శిక్షించినట్లు వికల్ప్ వివరించారు. దీనికి బస్తర్ ఐజీ, బీజాపూర్ ఎస్పీలే బాధ్యులని ఆయన ఉటంకిచారు. మొత్తంగా తాజా ప్రకటన ద్వారా తేలిందేమిటంటే మావోయిస్టు పార్టీలో అంతర్గత భద్రతపై ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయం.
మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితమని భావించే దండకారణ్యంలో ఇన్ఫార్మర్లు, రహస్య ఏజెంట్లు, కోవర్టులు అనే మూడంచెల వ్యవస్థను పోలీసులు పెద్ద ఎత్తున నిర్మించినట్లు వికల్ప్ ప్రకటన ద్వారా గోచరిస్తోంది. ఒకప్పటి తెలంగాణా ఘటనలను పరిగణనలోకి తీసుకున్నపుడు కోవర్టులు నేరుగా దళాల్లో, ఇన్ఫార్మర్లు, రహస్య ఏజెంట్లు సామాన్య ప్రజల్లోనే ఉంటూ పోలీసు నిధులతో తమకు అప్పగించిన టాస్క్ ను పూర్తి చేసే పనిలో ఉంటారు. వీరికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే నెలవారీ జీతాలను పోలీసులు జమ చేస్తున్నట్లు వికల్ప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం గంగళూరు ఏరియాలోనే 25 మంది కోవర్టులను, ఇన్ఫార్మర్లను, రహస్య ఏజెంట్లను గుర్తించారంటే పార్టీలో ప్రమాదకరర పరిణామాలను అంచనా వేసుకోవచ్చని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ హత్యల పరిణామాలు సహజంగానే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు భారీ ముప్పుగా భావించవచ్చు. ఉన్నఫళంగా కొత్త రిక్రూట్మెంట్ నిలిచిపోతుంది. దళాల్లోకి చేరేవారే కాదు, సాధారణ మిలిటెంట్లుగా వ్యవహరించేందుకు కూడా సందేహిస్తారు. అక్కడివారినే చంపేస్తున్నారు, తాము వెళ్లి చేసేదేముందనే సందేహం పలువురిలో కలుగుతుంది. కొత్తవారిని చేర్చుకునే అంశంలోనూ పార్టీ ఒకటికి, నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఎవరు కోవర్టులో, మరెవరు ఇన్ఫార్మర్లో తెలియని అనుమానపు చూపులు సాక్షాత్కరిస్తుంటాయి. ఫలితం అంచనా ప్రకారమే ఉండొచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉదంతాలే ఛత్తీస్ గఢ్ లోనూ పునరావృతం కావచ్చు… అది ఏ రూపంలోనైనా.
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే… తీవ్రవాదం అణచివేతలో ఛత్తీస్ గఢ్ భద్రతా జవాన్లు తెలుగు పోలీసులను అనుసరిస్తున్నారు… ముఖ్యంగా తెలంగాణా పోలీసుల బాటలో పయనిస్తున్నారు. ఇప్పుడు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణ పరిణామాలను ఎదుర్కుంటున్నది. గంగళూరు ప్రాంతంలో 25 మంది హత్యోదంతం చెబుతున్న వాస్తవం ఇదే. ఈ ప్రమాదకర పరిణామాలను మావోయస్టు పార్టీ ఎదుర్కుని నిలబడుతుందా? సహచరులను అనుమానిస్తూ, నిర్ధారించుకుంటూ హత్యల పరంపరను కొనసాగిస్తుందా? అనేది వేచి చూడాల్సిన అంశం.