కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సరికొత్త సందేహాన్ని లేవనెత్తారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ధరణిలో నమోదవుతున్న ప్రజల ఆస్తులపై ఆయా ప్రయివేట్ యాప్ సంస్థ రుణం తీసుకుంటే బాధ్యులెవరనేది జగ్గారెడ్డి సంధించిన ప్రశ్న. ధరణి పోర్టల్ పై, యాప్ పై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, తమ ఆస్తులను ధరణిలో నమోదు చేసిన తర్వాత ప్రభుత్వమే వాటిపై అప్పులు చేస్తుందేమోననే ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోందని జగ్గారెడ్డి అన్నారు. నిన్న మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈ విషయంలో అనేక సందేహాలను వ్యక్తం చేశారు.
ఇంకా జగ్గారెడ్డి ఏమంటున్నారంటే… ప్రజల ఆస్తులను ప్రయివేట్ యాప్ సంస్థ వద్ద పెట్టడమేంటనే ప్రశ్నలు ప్రజల్లో, ఉత్ఫన్నం అవుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఏదేని జరగరానిది జరిగితే దానికి జవాబుదారీగా ఎవరు ఉంటారని కూడా జగ్గారెడ్డి ప్రశ్నించారు. వాస్తవానికి ధరణి అనేది ఓ ప్రైవేట్ యాప్ అని, అందులో ప్రజల ఆస్తులను నమోదు చేస్తే భవిష్యత్తులో ఏవేని సమస్యలు వస్తాయేమోనని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎల్పీ అనుమానాన్ని వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు.
ధరణి అంశంలో ప్రజాభిప్రాయ సేకరణకు మంత్రులతో ఉప సంఘాన్నిగాని, అధికారులతో కమిటీనిగాని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ధరణిలో నమోదైన ప్రజల ఆస్తులపై ఆయా ప్రయివేట్ యాప్ సంస్థే రుణం తీసుకుంటే బాధ్యులెవరని కూడా నిలదీశారు. అయితే ఇవి ప్రజల్లో గల అనుమానాలుగా పేర్కొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇందుకు ఓ మార్గాన్ని కూడా ప్రభుత్వానికి సూచించడం గమనార్హం.
ముందుగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ ఆస్తులను ధరణిలో పొందుపర్చాలని పేర్కొన్నారు. తద్వారా ధరణిలో ఆస్తుల నమోదు అంశంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కూడా జగ్గారెడ్డి సూచించారు. ప్రజల ఆస్తులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నమోదై ఉన్నాయని, మరోసారి ప్రజల ఆస్తులను ధరణిలో నమోదు చేసి ప్రభుత్వమే వాటిపై అప్పులు తీసుకుంటుందనే అనుమానాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు.
అయితే జగ్గారెడ్డి లేవనెత్తిన ఆయా సందేహాలను తీర్చడం అధికార పార్టీ నేతలకు పెద్ద సమస్యే కాదనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తమ తమ ఆస్తులను ధరణిలో నమోదు చేసుకుని, వాటికి సంబంధించిన రశీదులను ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో నెలకొన్న సందేహాలను తీర్చవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా జగ్గారెడ్డి వ్యక్తం చేసిన సందేహాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తాయనే ఆశాభావాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.