ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అమానుష ఘటనలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం, ప్రతిఘటించిన పాపానికి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి, దహనం చేసేందుకు అల్లం మారయ్య అనే వ్యక్తి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుక చర్యలో నిందితున్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
అయితే మెడికో లీగల్ కేసైన మైనర్ బాలిక ఉదంతాన్ని దాచిపెట్టి రహస్యంగా పూజ ఆసుపత్రిలో చికిత్స చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణల మేరకు డీహెంహెచ్వో డాక్టర్ బి. మాలతి గురువారం ఆయా ఆసుపత్రిని సందర్శించారు. దాని యజమాని డాక్టర్ బాపురావుకు నోటీసు జారీ చేసి, ఆసుపత్రిలోని ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. ఆల్లోపతిక్ యాక్టు నియమ, నిబంధనలను ఉల్లంఘించి పూజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని, మెడికో లీగల్ కేసులను చట్ట ప్రకారం పోలీసు శాఖకు తెలుపకుండా చికిత్స అందిస్తున్నారని డాక్టర్ ను ప్రశ్నించారు.
అనంతరం చట్టప్రకారం ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందిగా డీఎంహెచ్వో మాలతి తన సిబ్బందిని ఆదేశించగా, ల్యాబ్ ను, ఆపరేషన్ థియేటర్ ను, వార్డును సీజ్ చేశారు. ఆయా ఆసుపత్రిలో నలుగురు ఇన్ పేషెంట్లు ఉండగా, వారిని రేపటిలోగా ఇతర ఆసుపత్రికిగాని, ప్రభుత్వ హాస్పిటల్ కు గాని పంపాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగరాదనే అభిప్రాయంతో పూజ ఆసుపత్రిని రేపు పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామన్నారు. మైనర్ బాలిక అత్యాచారయత్నం కేసును రహస్యంగా ఉంచి చికిత్స చేయడం నేరమని, అందువల్ల పూజ ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫొటో: ఖమ్మం నగరంలోని పూజ ఆసుపత్రి విభాగాలను సీజ్ చేస్తున్న సిబ్బంది, పక్కన డీఎంహెచ్వో డాక్టర్ బి. మాలతి