తమ పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు మొడియం విజ్జాలు సహా మొత్తం 25 మందిని ప్రజాకోర్టులో తామే శిక్షించినట్లు మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరున సుదీర్ఘ ప్రకటన వెలువడింది. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో బీజాపూర్ జిల్లాలో జరిగిన హత్యలపై మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు పొడసూపాయని, పరస్పర ఘర్షణలో విజ్జాలు సహా మొత్త ఆరుగురు నక్సలైట్లను సహచర మావోయిస్టులే హత్య చేశారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వికల్ప్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజాపూర్ జిల్లాలో పోలీసు అధికారులు నిర్మించిన రహస్య ఏజెంట్లను, కోవర్టులను, ఇన్ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో, వారి మద్ధతులో ప్రజాకోర్టులో శిక్షించినట్లు ఆయన ప్రకటించారు. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడుకునేందుకు ప్రజల మద్ధతు, జాగరూకతతోనే కోవర్టులను, ఇన్ఫార్మర్లను పసిగట్టామన్నారు. ముఖ్యంగా బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ఏరియాలో స్పష్టమైన ఆధారాలతో 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులను, ఎనిమిది మంది ఇన్ఫార్మర్లను గుర్తించి ప్రజాకోర్టులో శిక్షించామని వికల్ప్ వివరించారు.
రహస్య ఏజెంట్లను శిక్షించే క్రమంలోనే గంగళూరు ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడు విజ్జాలు కోవర్టుగా బహిర్గతమయ్యాడని చెప్పారు. పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వాన్ని నష్టపరిచే లక్ష్యాన్ని ఇతనికి ఇవ్వబడిందన్నారు. రెండేళ్లుగా ఇతను కోవర్టుగా పనిచేస్తున్నాడని, నాలుగుసార్లు ముఖ్యమైన సమావేశాల సందర్భంగా పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. ప్రజల మద్ధతు, జాగరూకత, స్థానిక నిర్మాణాల, పీఎల్జీఏల పోరాట పటిమతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు దాడులకు గురికాకుండా తప్పుకున్నామన్నారు.
తగిన ఆధారాలు లభించిన తర్వాతే విజ్జాలును ప్రశ్నించగా, తాను ఏ విధంగా కోవర్టుగా మారిందీ పూర్తిగా వివరించాడని వికల్ప్ చెప్పారు. దీంతో ప్రజాకోర్టులో కోవర్టులను, ఇన్ఫార్మర్లను, రహస్య ఏజెంట్లను శిక్షించామని, ఇందుకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీలే బాధ్యులని వికల్ప్ వ్యాఖ్యానించారు.
ఫొటో: హత్యకు గురైనా మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు విజ్జాలు