(అమృతవర్షిణి జయరాజ్)
అమ్మా…నన్ను క్షమించు..!
నీ గుండె కోతకు కారణమైన
నన్ను మన్నించు…!!
“ఒక ఆడ కూతుర్ని చంపిన నా కొడుకును కూడా కాల్చేయండయ్యా…”
అని నువ్వన్న నాడే నేను చచ్చి పోయానమ్మా…..
నేను నీ కడుపున పడ్డనాడు నువ్వెంతగా మురిసావో…..
మీ కష్టాల్ని కడతేర్చే కొడుకునవుతానని నాన్న ఎన్ని సార్లు నీ గర్భాన్ని ముద్దాడి నన్ను పలకరించాడో…..
మీ ఊహల్లో నన్నెంతగా ఊయలలూపారో కదా….!
ఈ నేలన పడ్డనాడు మీ ఆనందాలకు హద్దులున్నాయా…?
మీ సంతోషాలను తూచగల్గే తూనికలున్నాయా…?
మీ హృదయమే ఓ నందన వనం కదూ….!!
బాలచంద్రుడిలా దినదిన పరవర్ధమానమవుతున్న నాలో
పర స్త్రీలను కాంక్షించే పూలరంగడు ఇంద్రుడు ఆవహిస్తున్నాడని నేనూహించలేదు.
అమ్మా నేను అశక్తుడ్ని. నేనూ సగటు మనిషినే….
పేదరికం…
పూట గడవని రోజులు…
చదువు గాలికొదిలి
పనిలో కుదరడం….కుదురుగా కూర్చోక చెడు స్నేహాలు, పాడు వ్యసనాలు….
రా రమ్మని పిలిచే మద్యం……
తూలుతూ తిరుగుతూ ఉంటే స్వర్గం నా కాళ్ళ కింద తేలియాడింది.
ప్రపంచం బట్టలిప్పి చూపించే చేతిలో సెల్ ఫోన్…
నా అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు.
అమ్మా ఇందరి శత్రువులకు నేను బానిసనయ్యాను.
ఇది చాలదా….? మనిషి మృగం కావడానికి…..!!
నా జీవితంలో నేనెప్పుడూ చెడ్డవాళ్ళతో పోల్చుకున్నాను తప్ప మంచి వాళ్ళతో సరి తూచుకోలేదు.
“మద్యము”డు నాలో ఉంటే నాకెంత ధైర్యమొచ్చేదో…..!
దేన్నైనా సాధిస్తాననే గుడ్డి నమ్మకం.
ఈ గుడ్డి తనమే ఆ చీకటి రాత్రి ఓ ఆడపిల్ల బ్రతుకును ఛిద్రం చేసింది. పాపం ఆ పిల్లెవరో తెలీదు. ఆ అమాయకమైన చూపులలో నా అక్క కనపడలేదు.
“హెల్ప్…హెల్ప్” అని అరిచినప్పుడు
నా చెల్లీ గుర్తుకు రాలేదు.
అమ్మా నువ్వైనా గుర్తొస్తే ఇంత ఘోరం జరిగేది కాదు. ఎలా గుర్తొస్తారు…?
“కోరికల ఇంద్రుడు” మత్తుతో ధైర్యాన్నిచ్చే “మద్యము”డు నన్ను పూర్తిగా పూనితే…
అందుకే ఆ క్షణాన……
రాక్షసుడు రంకెలేసాడు.
ఇంతటి ఘోరానికి సాక్షీభూతంగా నిలచిన
చీకటి ఎంతగా విలపించిందో….
ఎంతగా కన్నీరు కార్చిందో…..
నా అక్కలాంటి ఆడకూతుర్ని కడతేర్చిన
కసాయిని నేను. నా చెల్లిలా సాయమడిగిన అమాయకపు ఆడపిల్లను పొట్టన పెట్టుకున్న కర్కోటకుడ్ని.
నన్ను క్షమించమ్మా…నాకీ శిక్ష సరైనదే…!
చేసిన పనికి మానసిక క్షోభతో నిత్యం చావాల్సిన నన్ను ఇంత త్వరగా చావు స్వాగతం పలికినందుకు ధన్యుడను.
లోకమెంతగా ఛీ కొట్టిందో నేనెరుగుదును.
ఎవరైనా నన్ను బ్రతకాలని కోరుకున్నారా?
ఆఖరికి నువ్వు కూడా…..!!
ఇదేనమ్మా….మంచికి చెడుకున్న తేడా…!
మరచిపో…
చెడును మరచినట్టుగానే
నన్నూ మరచిపో….
నీ పవిత్ర గర్భాన్ని మలిన పరచిన దుర్మార్గుడ్ని. నన్ను శాశ్వతంగా మరచిపో
అమ్మా…నువ్వాదరిస్తే మరో జన్మలో ఆడబిడ్డనై పుడతాను. అప్పుడు నా కన్నీటితో నీ పాదాలను అభిషేకిస్తాను.
అమ్మా….!
చివరి కోరిక వింటావు కదూ….
పుట్టుకతో ఎవడూ నేరస్థుడు కాడు.
నన్ను నేరస్థుడిగా మార్చిన ఈ పేదరికాన్ని
నన్ను క్రూరుడిగా తీర్చిదిద్దిన ఈ మద్యాన్ని కూడా ఎన్ కౌంటర్ చేయమని నా మాటగా సజ్జనార్ సార్ కి
చెప్పమ్మా… ఇంకెందరో ఆడ కూతుళ్ళ ఉసురు నాలాంటి మృగాలు తీయకుండా…..
ఎందరో తల్లుల కడుపు కోతలకు నావంటి కొడుకులు కారణం కాకుండా….
“మద్యం మహమ్మారిని” మట్టుబెట్టమని చెప్పమ్మా….
ఇది చేయని ప్రభుత్వాలు ఉన్నంత కాలం
గజానికో “గాంధారీ కొడుకులు” ఈ నేలన పుట్టుకొస్తూనే ఉంటారు.
అప్పుడు శ్మశానాన మండాల్సిన చితి మంటలు నిత్యం తల్లుల గుండెల్లో రావణ కాష్టంలా
మండుతూనే ఉంటాయ్….
తల్లులు ఎవరైతేనేం….
“అమ్మ మనసు” అందరిదీ ఒకటే కదమ్మా…!!
నీ పాదాల సాక్షిగా…
పశ్చాత్తాప కన్నీటితో…
నీ….బిడ్డ