రివర్స్ పంపింగ్, రివర్స్ టెండరింగ్ గురించి విన్నాం…ఈ రివర్స్ జర్నలిజం ఏమిటి? అనేదే కదా మీ ప్రశ్న. రివర్స్ జర్నలిజం గురించి తెలుసుకునే ముందు, విషయ పరిజ్ఞానం కోసం రివర్స్ పంపింగ్, రివర్స్ టెండరింగ్ గురించి ముందుగా చెప్పుకోవలసిందే.
రివర్స్ పంపింగ్ అంటే… తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేసిన అద్భుతమన్నమాట. వర్షాభావం కారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహం అంతగా లేనప్పుడు మహారాష్ట్రలో కురిసిన వానలవల్ల ప్రాణహిత నది ప్రవహించింది. ప్రాణహిత నదిలో గల నీటిని గోదావరి నదిలోకి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా గోదావరి నదిలో కలుపుతున్నారు. ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి వెళ్లే గ్రావిటీ కాల్వలకు మళ్లిస్తున్నారు. క్తుప్తంగా ఇదీ రివర్స్ పంపింగ్ విధానం. దీని ద్వారా రైతులకు మేలు జరుగుతోంది.
ఇక రివర్స్ టెండరింగ్ విధానాన్ని పరిశీలిస్తే… ఈ పద్ధతి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఆదా చేసినట్లు వార్తలు వచ్చాయి. రివర్స్ టెండరింగ్ వల్ల కేవలం పోలవరం ప్రాజెక్టు పనుల్లోనే రూ.1,532.59 కోట్ల మొత్తం డబ్బు ఆదా అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా అనేక ప్రాజెక్టుల్లోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల సర్కారు ఖజానాకి లబ్ధి చేకూరుతోంది.
ఇప్పుడు రివర్స్ జర్నలిజం గురించి చెప్పకుందాం. సాధారణంగా ఏదేని కుంభకోణం గురించిగాని, అవినీతి అధికారి గురించిగాని, అక్రమ దందాలపైగాని మీడియాలో వార్తలు ప్రచురించే సందర్భంగా సంబంధిత అధికారుల వివరణ కూడా తీసుకోవాలనేది జర్నలిజంలో ప్రాథమిక సూత్రం. దీన్ని తెలుగు మీడియా ఖచ్పితంగా పాటిస్తున్నదా? అనే ప్రశ్నకు అవసరాన్నిబట్టి మాత్రమేనని చెప్పక తప్పదు. ఇందులోనూ ‘అసమదీయ, తసమదీయ’ అనే పద్ధతులు కూడా ఉంటాయన్నమాట.
ఉదాహరణకు ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని అనుకుందాం. ఇందుకు సంబంధించి పత్రిక లేదా టీవీ విలేకరి ఎవరైనా పరిశోధనచేసి, ఆధారాలతో వార్తా కథనం రాసినా, ప్రసారం చేసినా ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారి వివరణను కూడా తీసుకోవాలి. ఆయన ఏం చెబుతున్నారో తమ వార్తా కథనంలో చివరగా చెప్పాలి. ఇది జర్నలిజంలో కనీస సూత్రం. ఇటువంటి సందర్భాల్లో కొందరు వివరణ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ‘నిరాకరించారు’ అని స్పష్టంగా వార్తా కథనంలో చెప్పాలి.
ప్రింట్ మీడియాలో అయితే ఇటువంటి వార్తల కథనం ఓ నాలుగు కాలమ్స్ ఉంటే, వివరణ మహా అయితే సింగిల్ కాలమ్, లేదంటే ఓ నాలుగు లైన్ల వరకు ప్రచురిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా కథనాల్లో అయితే అయిదు నిమిషాల వార్తా కథనానికి కనీసం అయిదు సెకన్ల నిడివిలోనైనా ‘వివరణ’ను ప్రసారం చేస్తుంటారు. జర్నలిజంలో కనీస విలువలు పాటించే సంస్థలు మాత్రమే తమ వార్తా కథనాల్లో ‘వివరణ’ పద్ధతిని తు.ఛ. తప్పకుండా పాటిస్తాయి.
కానీ ఇప్పుడంతా రివర్స్ జర్నలిజం అన్నమాట. అంటే బాధితుల ఆవేదన చారాణ స్థాయిలో మ.మ. అనిపించి, నిందితుల సంబంధీకుల వివరణ బారాణా మేరకు జనంలోకి తీసుకువెళ్లడమే ‘రివర్స్ జర్నలిజం’ అన్నమాట. ఖమ్మం నగరంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం, ప్రతిఘటించిన ఆమెపై నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన అమానుష ఘటన ఈనెల 5వ తేదీన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దురాగత ఘటనలో నిందితునిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి కూడా నెట్టారు.
ఈ ఘటనలో ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి అత్యుత్సాహం ‘రివర్స్ జర్నలిజం’ దిశగా పయనించడమే అసలు విశేషం. బాధిత బాలిక గురించి రెండు నిమిషాలపాటు మాత్రమే చెప్పిన ఆయా ఛానల్, నిందితుని కుటుంబ సభ్యుల వాదనకు ఆరు నిమిషాలకుపైగా వ్యవధిని కేటాయించి మరీ వార్తా కథనం ప్రసారం చేయడం సహజంగానే చర్చకు దారి తీసింది. ఆయా కథనంలో నిందితుని కుటుంబ సభ్యులకు అంతర్లీనంగా సమాధానం అందిస్తూనే రిపోర్టర్ ప్రశ్నలు సంధించడం గమనార్హం. అంతేకాదు పది రోజుల క్రితం జరిగిన ఘటన అంటూ… తేలిగ్గా తీసిపారేసే భావనను వ్యక్తం చేయడం గమనించాల్సిన మరో అంశం. ఆయా విధంగా ఈ ఛానల్ ప్రసారం చేసిన వార్తాకథనం నిందితునిపై పోలీసుల చర్యతో అభాసు పాలైందన్నది వేరే విషయం. కానీ అత్యంత అమానుష ఘటనలో కనీస ఇంగితజ్ఞానం లేకుండా రిపోర్టర్ పంపితే, సదరు టీవీ నిర్వాహకులు ఏ ప్రాతిపదికన దాన్ని ప్రసారం చేశారనే ప్రశ్న కూడా జర్నలిస్టు సర్కిళ్ల నుంచి వినిపిస్తోంది.
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే… కాళేశ్వరం ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు సాగునీరు అందుతోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తపు డబ్బు ఆదా అయింది. మరి రివర్స్ జర్నలిజం వల్ల ఆయా న్యూస్ ఛానల్ కుగాని, దాన్ని అందించిన ప్రతినిధికిగాని ఒనగూరిన ప్రయోజనం ఏమిటనే ప్రశ్నకు మాత్రం సమాధానాన్ని మీరే ఊహించుకోవాలి… మాకు తెలియదు. అదీ అసలు సంగతి.