మీ ఇంట్లో బోరుందా? అర్థం కాలేదా…? బోరు బావి ఉందా? అనేది ప్రశ్న. ఉంటే ఏంటీ అంటే… దానికి ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ ఉంటే మాత్రం ఇక ‘బోరు’…భోరున ఏడవాల్సిందే మరి. రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే విద్యుత్ బిల్లులను చూసి గుండె తరుక్కుపోవలసిందే. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ భారాన్ని తల్చుకుని విలపిస్తుంటే, కొత్తగా ఈ బోరుబావి బాధేమిటి బాబోయ్… అనుకుంటున్నారు కదూ!
సీపీఎం అనుబంధ పత్రిక ‘నవ తెలంగాణా’ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం బోరుబావులకు గల విద్యుత్ మీటర్లపై వడ్డించబోయే ఛార్జీల మోతలంటూ ఈ కథనం వివరించింది. ఈ పరిణామం ఇళ్లను కిరాయికి ఇచ్చిన యజమానులకే కాదు, కిరాయికి ఉన్నవాళ్లకు కూడా షాక్ కలిగించే అంశమే.
ఈ పత్రిక కథనం ప్రకారం ‘కామన్ సర్వీసెస్ ఐడెంటిఫికేషన్’ పేరుతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఈ సర్వే కొనసాగుతోంది. గత ఫిబ్రవరిలోనే సర్వే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా సర్వేను తాత్కాలికంా నిలిపివేశారుట. కరోనా కట్టడికోసం విధించిన ‘లాకు’లన్నీ దశలవారీగా కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన నేపథ్యంలో మళ్లీ ఈ సర్వే ప్రారంభించారుట.
ఏమిటీ దీనివల్ల ప్రజలకు కలిగే నష్టం అంటే…ఉదాహరణకు ఇంటి ఓనర్, కిరాయిదార్లు గల ఇళ్లల్లో ఓ బోరుబావి ఉందనుకోండి, ఇందుకు ప్రత్యేక విద్యుత్ మీటరును వాడుతుంటారు. ఏ పోర్షన్ కు ఆ ఫోర్షన్ ను విభజిస్తూ సబ్ మీటర్లు కూడా ఉంటాయి. అపార్ట్మెంట్లలో సబ్ మీటర్లు ఉండకపోవచ్చు కానీ, మెయింటెనెన్స్ ఛార్జీల కింది కొంత మొత్తాన్ని ఫ్లాట్ ఓనర్ల నుంచి, కిరాయిదార్ల నుంచి వసూలు చేస్తుంటారు.
ఇదిగో ఇటువంటి ఇళ్లల్లో, ఫ్లాట్లలో నివాసముండే ప్రజలపాలిట ‘కామన్ సర్వీసెస్ ఐడెంటిఫికేషన్’ సర్వే శరాఘాతంగా మారబోతోందన్నది ‘నవ తెలంగాణా’ పత్రిక వార్తా కథనపు సారాంశం. గతంలో 100 యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగిస్తే శ్లాబ్ రేట్ గా ప్రతి యూనిట్ కు రూ. 3.30 చొప్పున ఛార్జీలు విధించేవారు. కొత్త విధానం వల్ల ప్రతి యూనిట్ కు రూ. 5.00 చొప్పున విధిస్తారట. అంటే 100 యూనిట్ల విద్యుత్ వినియోగానికి అదనంగా మరో రూ. 170.00 చెల్లించాలన్నమాట. అంతేకాదు కేటగిరీల విభజన కూడా ఉండదట. 0-200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ కు రూ. 5.00 చొప్పున శ్లాబ్ ప్రాతిపదికన ఛార్జీల భారం మోపనున్నట్లు ఆయా వార్త కథనంలో ‘నవ తెలంగాణా’ పత్రిక వివరించింది.