‘ఇంటా, బయటా విమర్శలు… నష్టనివారణ చర్యలు… దిద్దుబాటు చర్యలు…’ ఇటువంటి పదాలు ఎక్కువగా పత్రికా పరిభాషలో వాడుతుంటారు. ఏదేని రాజకీయ పార్టీగాని, ఇతర వ్యవస్థలుగాని ఉద్దేశపూర్వకంగానో, అన్యాపదేశంగానో, కాకతాళీయంగానో ప్రజాభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించి, ఆ తర్వాత తప్పును సవరించుకునేందుకు చేపట్టే చర్యలను ఉటంకిస్తూ పత్రికలు ఆయా పదాలను తమ వార్తా కథనాల్లో వాడుతుంటాయి.
దిగువన గల ఈ వార్తా కథనాన్ని కూడా ఓసారి చదవండి.
అత్యధిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికెట్ గల ఈనాడు దినపత్రిక ఓ సంఘటనలో సరిగ్గా ఇదే పనిచేసినట్లు కనిపిస్తోంది. ఖమ్మం నగరంలో 13 ఏళ్ల బాలికపై అల్లం మారయ్య అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించడం, ప్రతిఘటించిన బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘోర ఘటన గురించి తెలిసిందే. ఈ అఘాయిత్యంపై పలు రాజకీయపక్షాల ఆందోళనతో సోమవారం ఖమ్మం నగరం అట్టుడికిపోయింది. ఫిర్యాదుకు ముందే పోలీసులు అప్రమత్తమై విచారణ జరిపి, నిందితుడు మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో కూడా హాజరుపర్చారు. కోర్టు నిందితునికి రిమాండ్ విధించింది.
ఓ అభాగ్య మైనర్ బాలికపై జరిగిన ఈ దాష్టీకానికి సంబంధించి నిన్న ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించిన తీరును వేలెత్తి చూపుతూ ts29 ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనాడు బుధవారం నష్టనివారణ చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. లేదంటే దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు గోచరిస్తోంది. ఇంకా కాదంటే ఇదే వార్తా కథనంలో ఉటంకించిన ఓ వాక్యం ప్రకారం… ఇంటా, బయటా విమర్శలకు భీతిల్లినట్లు ద్యోతకమవుతోంది. మొన్నా, నిన్నటి ఘటనలను ప్రోదిచేసి, మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఓ కథనాన్ని తన పాఠకుల ముందుంచినట్లు స్పష్టమవుతోంది. ఓ వెబ్ సైట్ కథనానికి ఈనాడు వంటి అగ్రపత్రిక దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? అని కూడా కొందరు ప్రశ్నంచవచ్చు. కానీ ప్రజల్లో, ముఖ్యంగా పాఠకుల్లో పలుచనయ్యే పరిణామాలు అనివార్యమైనప్పుడు ఇటువంటి దిద్దుబాటు, నష్టనివారణ చర్యలు ఎవరైనా తీసుకోక తప్పదనేది నిర్వివాదాంశం. విషయం ఇంకా అప్పుడే అయిపోలేదు సుమీ.
కొసమెరుపుగా చెప్పుకోవలసిన మరో ముఖ్యాంశమూ ఉంది. బాలికపై అఘాయిత్యం ఘటనకు సంబంధించి ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తీవ్రంగా చలించి, అత్యంత వేగంగా స్పందించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడానికి ముందే విచారణ జరపాలని అదనపు డీసీపీ పూజను ఆదేశించారు. ప్రత్యేక పోలీసు టీంను కూడా నిందితునికోసం రంగంలోకి దించారు. పారిపోకుండా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, పరామర్శించారు.
కారణం ఏదైనప్పటికీ ఆయా ఘటనకు సంబంధించి సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఫొటో ఈనాడులో ఎక్కడా కనిపించలేదు. ఇది యాధృచ్చికంగానే జరిగిందా? లేకుండా సీపీ ఫొటో ప్రచురించకూడదనే నిర్ణయాన్ని స్థానికంగా ఏమైనా తీసుకున్నారా? అనే సందేహాలను పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పబ్లిసిటీకోసం పాకులాడే అధికారి కాదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈనాడు ఆయన ఫొటోను ప్రచురించే అంశంలో ఏదేని నియమాన్ని అనుసరించిందా? లేక అప్రకటిత నిషేధం ఏమైనా విధించిందా? అనే సంశయాలు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. లేదంటే ఏదేని ఓ వర్గపు ఒత్తిళ్లలో ఈనాడు రిపోర్టింగ్ విభాగం పనిచేస్తున్నదా? అనే ప్రశ్నను కూడా పోలీసు వర్గాలు లేవనెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రచురించిన ఫొటోల తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి, ఈనాడు యాజమాన్యం ఆత్మపరిశీలన, కాదు… కాదు… వార్తా పరిశీలన చేసుకోవలసి ఉందనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది.