పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి, పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించిన అమానుష ఘటనలో నిందితున్ని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండుకు పంపించారు.
ఖమ్మం వన్ టౌన్ సీఐ కథనం ప్రకారం… ఖమ్మంలోని పార్శీబంధంలో నివసించే అల్లం సుబ్బారావు ఇంట్లో 13 ఏళ్ల బాలిక పనిచేస్తోంది. గత నెల 19వ తేదీన ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయా మైనర్ బాలిక ఒంటరిగా ఉండగా, సుబ్బారావు కుమారుడు అల్లం మారయ్య (25) ఆమెను బలాత్కరించే ప్రయత్నం చేయగా, అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో మైనర్ బాలికను చంపాలనే ఉద్ధేశంతో ఆమెపై పెట్రోల్ పోసి మారయ్య నిప్పంటించాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఉప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారయ్యపై కేసు నమోదు చేశారు. నిందితుడైన మారయ్యను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ ఓ ప్రకటనలో వివరించారు.