గత ఫిబ్రవరి 22వ తేదీన పోలీసులపై ఓ వార్తా కథనం రాసి, ఆ మరునాడే ఈనాడు పత్రిక బెంబేలెత్తిన సంగతి తెలిసిందే కదా? ‘దొంగలతో దోస్తీ’ శీర్షికన ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై తెలంగాణా హోం మంత్రి మహమూద్ ఆలీతోపాటు తెలంగాణాలోని పలువురు పోలీస్ కమిషనర్లు ఖండనలతో ముప్పేట దాడి చేసేసరికి ఈనాడు పత్రిక బెంబేలెత్తింది. మాకు ‘కించపరిచే ఉద్ధేశం లేదు’ మహాప్రభో అంటూ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో వివరణ ఇచ్చుకుంది. పనిలో పనిగా తాము తెలంగాణా పోలీసుల శక్తి, యుక్తుల గురించి అనేక సానుకూల కథనాలు రాశామని గతాన్ని గుర్తు చేస్తూ మరీ పోలీసులకు సాగిలపడినంత పని చేసింది. అత్యధిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫెకట్ గల ఈనాడు వంటి అగ్రపత్రిక ఈ తరహాలో వివరణ ఇచ్చుకోవడం తన దశాబ్ధాల ప్రస్థానంలోనే అరుదైన ఘటన. అప్పట్లో ఈ అంశం జర్నలిస్టు సర్కిళ్లలో తీవ్ర చర్చకు కూడా దారి తీసింది.
అయినప్పటికీ ‘ఈనాడు’లో ఇప్పటికీ కొన్ని విలువలు మిగిలి ఉన్నాయని ఈమధ్యే చెప్పుకున్నాం కదా? క్రికెట్ బెట్టింగ్ పై భారీ వార్తాకథనం ప్రచురించిన అంశంలో, వార్త రాసిన విలేకరే బెట్టింగ్ బాగోతంలో పాల్గొన్న ఆడియో సంభాషణలు లీక్ కావడంతో ఈనాడు యాజమాన్యం ముందుగానే సర్దుకుంది. పోలీసులు కేసు నమోదు చేస్తే పత్రిక పరువు పోతుందనే భావనతో కాబోలు ఆయా పాత్రికేయున్ని ఇంటికి పంపించేసింది. అందుకే ఈనాడులో ఇప్పటికీ ఇంకాస్త విలువలున్నట్లు భ్రమించాల్సి వచ్చింది. కానీ అవి భ్రమలు మాత్రమేనని తాజా ఘటనతో భావించాల్సి వస్తోంది.
అసలు విషయమేమిటంటే…? ఓ 13 ఏళ్ల బాలికపై ఖమ్మం నగరంలో ఘోర అఘాయిత్య ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఓ సంపన్న కుటుంబం ఇంట్లో పనిచేస్తున్న బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నానికి పాల్పడగా, బాలిక ప్రతిఘటించింది. దీంతో బాలికపై పెట్రలో పోసి ఇంటి యజమాని కుమారుడు నిప్పంటించాడు. ఇదే విషయాన్ని స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ జస్టిస్ ఉషశ్రీ ముందు బాలిక తన మరణ వాంగ్మూలంగా ఇచ్చింది. డెబ్బయి శాతానికి పైగా శరీరం కాలిన ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై నిన్న ఖమ్మం నగరం అట్టుడికింది. సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, బీజేపీ, ఆయా పార్టీల అనుబంధ సంస్థలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాలని నినదించారు. మొత్తం ఘటనపై ఒకటీ, అరా న్యూస్ ఛానళ్లు తప్ప మిగతా న్యూస్ ఛానళ్లు వార్తాకథనాలుగా కవర్ చేశాయి. జర్నలిస్టులుగా చెప్పుకునేవారు కొందరు మాత్రం తప్పంతా బాలికదే అనే భావన స్ఫురించే విధంగా వార్తా కథనాలు వండి వార్చారు. సరే ఇందులో ఏ మర్మం దాగుందనే విషయాన్ని కాసేపు వదిలేద్దాం.
కానీ ఈనాడు పత్రికకు ఏమైంది? ఓ చిన్న ఘటన జరిగితే, దాన్ని ఈనాడు అందరికన్నా ముందు కవర్ చేస్తే విషయాన్ని చించి చాటంత చేసే ఈనాడు తరహా కథనాలు మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి కనిపించకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిన్ ఎడిషన్ లో ఘటనకు సంబ:ధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినప్పటికీ, జిల్లా పేజీలో మాత్రం అమానుషంపై ఎటువంటి తదుపరి కథనం లేకపోవడం గమనార్హం.
అత్యాచారయత్నం, ఆపై దహనం చేసేందుకు జరిగిన ప్రయత్నపు ఘటనను ‘ బాలిక అత్యాచార ఘటనపై సీపీ ఆగ్రహం’ అంటూ ఓ పదిలైన్ల వార్తను, అదీ పోలీస్ పీఆర్వో ఇచ్చిన ప్రకటనను మాత్రమే ప్రచురించి మ…మ అనిపించారు. మెయిన్ ఎడిషన్లో రాసిన వార్తా కథనంలోనూ ‘ఆరోపణలు ఎదుర్కుంటున్న కుటుంబం వాదన మరోలా ఉంది’ అంటూ ఉటంకించడం గమనార్హం. ఈ వాక్యం తరహాలోనే అదేదో టీవీ ఛానల్ కూడా ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. సుమారు ఎనిమిది నిమిషాలపాటు ఆయా టీవీ ప్రసారం చేసిన వార్తా కథనంలో సుమారు రెండు నిమిషాలు మాత్రమే బాధితురాలి గురించి చెప్పడం, మిగతా సమయాన్ని ఆరోపణలు ఎదుర్కుంటున్న కుటుంబ వాదనకే ప్రాధాన్యతనివ్వడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బాలికపై జరిగిన ఈ ఘటనను ఈనాడు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? తెలుగు మీడియాకు చెందిన దాదాపు అన్ని పత్రికలూ మెయిన్ ఎడిషన్లలో ప్రాధాన్యతను ఇస్తూ ప్రముఖంగా ఘటనా కథనాలను ప్రచురించాయి. జిల్లా అనుబంధాల్లో ఫాలో అప్ స్టోరీలను కూడా ముద్రించాయి. కానీ ఈనాడు మాత్రం ఈ ఘోర ఘటనకు పెద్దగా ప్రాధాన్యత కల్పించపోవడంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఈనాడు వ్యవహరించిన తీరుతెన్నుల్లో ఎవరి ఇష్టాయిష్టాలు ఏమిటనేది జవాబులేని ప్రశ్నే కావచ్చు.
కానీ ‘మా కోడి కూయనిదే తెల్లారదు’ అనే సామెత చందాన ఇప్పటికీ అంచనా వేసుకుంటేనే ఇబ్బంది. ఎందుకంటే ఈ ఘటనలో బాధిత కుటుంబం ఫిర్యాదుకు ముందే పోలీసులు మేల్కొన్నారు. తమ పీఆర్వో, స్పెషల్ బ్రాంచ్ విభాగపు సమాచారంతో ఘటనను సుమోటోగా స్వీకరించామని పోలీస్ కమిషన్ తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ప్రకటించారు. అత్యంత వేగంగా పోలీసు శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకుంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ ఘటనలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బహుషా ఈ పరిణామాలు ఈనాడుకు నచ్చలేదు కాబోలుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాము వార్తలు రాయకుండా కేసు నమోదు చేయడమేంటి? విచారణ జరపడమేంటి? నిందితున్ని అదుపులోకి తీసుకోవడమేంటి? అనే భావన కలిగిందేమోననే వాదన వినిపిస్తోంది. లేదంటే ఎవరైనా కొందరి ఒత్తిళ్లకు లొంగి స్థానిక విలేకరులు ఘటనకు అంత ప్రాధాన్యత లేదని డెస్కును తప్పుదోవ పట్టంచారా? అనే సంశయాలు కూడా ఈనాడు పాఠక వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ఇప్పుడు దశాబ్ధాల క్రితంనాటి జర్నలిజం కాదు. మీడియా ఏకచక్ర ఆధిపత్య ధోరణి లేనే లేదు. ఈనాడు కూయకున్నా… వార్తలకు అనేక రూపాల్లో తెల్లారుతోంది. ఫిర్యాదుకు ముందే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన ఇదే విషయాన్ని బోధపరుస్తోంది. అయినప్పటికీ ఈనాడుకు విషయం అర్థం కాకుంటే దాని పాఠకుల ప్రాప్తంగా మనమూ అభిప్రాయపడక తప్పదు మరి.