తనపై అత్యాచారయత్నం చేశారని, ప్రతిఘటించడంతో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని 13 ఏళ్ల మైనర్ బాలిక బావురుమంటోంది. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో చావు, బతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి తమ కుమార్తె స్పృహలో లేదని, నేడే స్పృహలోకి రావడంతో ఆమె కథనం ప్రకారం ఈరోజే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధిత మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనే స్పష్టంగా పేర్కొన్నారు.
ఖమ్మం నగరంలో జరిగిన ఈ ఘోర ఘటనపై బాలిక వాంగ్మూలాన్ని స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ జస్టిస్ ఉషశ్రీ రికార్డు చేశారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బాధితురాలకి న్యాయం చేయాలని ఆమె చికిత్స పొందుతున్న ప్రయివేట్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సాక్షాత్తూ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తదితర పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై తమకెవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, తమకు ముందుగానే అందిన సమాచారం మేరకు నేరుగా దర్యాప్తు ప్రారంభించామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగానే బాధిత బాలికకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడంలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. నిందితులుగా భావిస్తున్నవారి తరపున వకాల్తా పుచ్చుకుని మరీ బరితెగింపు ప్రచారానికి దిగిన తీరు విస్మయాన్ని కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత బాలిక గురించి సాగుతున్న దుష్ప్రచారపు సారాంశం ఏమిటంటే… ఉదయం 5.30 గంటలకు పూజగదిలో ప్రమాదం జరిగిందట. పూజగదిలోకి ఆమె ఎందుకు వెళ్లిందీ, బయటకు ఎందుకు వచ్చిందీ ఇంటి యజమానికి తెలియదట. కానీ లంగా బొందులు పొడుగయ్యాయని, చిరిగిపోతున్నాయని, వాటిని కాల్చుకుని ఆర్పుకుంటున్నానని బాలిక చెప్పిందట. ఆ అమ్మాయి మాయ చేసి అబద్ధాలు చెప్పే అమ్మాయేనా? అని కూడా కొందరు ప్రశ్నిస్తూ సాగిస్తున్న ప్రచారం తీరు పలు సందేహాలకు తావు కల్పిస్తోందనే వ్యాఖ్యలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటువంటి అనేక ప్రశ్నలకు జవాబులు కూడా లభించాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది.
– పద్దెనిమిది, పదహారు రోజుల క్రితం ఘటన జరిగిందని కొందరు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఏ తేదీన జరిగింది? అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించాల్సి ఉంది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన తేదీకి, ఆయా రోజులకు కుదురుతున్నదీ లేనిదీ నిశితంగా పరిశీలించాల్సిన అవసరముంది.
– ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పూజ గదిలో దీపపు చిమ్మె కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా నిజమే అయితే… ఆ సమయంలో ఓ పని మనిషికి పూజగదిలో ఏం పని ఉంటుంది? అనేది మరో ప్రశ్న.
– ఈ ప్రచారపు సారాంశంలోనే భిన్నవాదన కనిపిస్తుండడం గమనార్హం. ఓసారి పూజగదిలో ప్రమాదమంటున్నారు. మరోసారి బొందులను కాల్చుకుందని, తమతో మాట్లాడిందని చెబుతున్నారు. ఇంతకీ పూజ గదిలో ప్రమాదం జరిగిందా? బొందులు కాల్చుకుంటే అగ్నికీలలు మైనర్ బాలికను ఆవహించాయా? ఒళ్లంతా కాలుతుండగానే అంత తీరిగ్గా ఆమె మాట్లాడిందా? అనే ప్రశ్నలకూ సరైన సమాధానం లభించాల్సి ఉంది.
– కేవలం 13 ఏళ్ల మైనర్ బాలిక అబద్ధాలు చెప్పి, మాయ చేసి తనపై లైంగికదాడికి ప్రయత్నం జరిగిందని చెబుతుందా? తాను ప్రతిఘటించేసరికి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని నిందితునిగా భావిస్తున్న వ్యక్తి పేరు బాలిక బాహాటంగానే చెబుతోంది. ఎంతో భవిష్యత్తు గల బాలిక మరీ ఇలా అబద్ధాలు చెబుతుందా? అనేది ప్రచారం చేస్తున్నవారికే తెలియాలంటున్నారు.
– బాలికతోపాటు నిందితునిగా భావిస్తున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయని ప్రచారం చేస్తున్నారు. ఇదే నిజమైతే అతను తన గాయాలకు ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు? ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? అందుకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా? ఏయే మందులు వాడారు? గాయాల తాలూకు ఆనవాళ్లు ఉన్నాయా? అనే విషయాలు తేలాల్సి ఉంది.
– నిజంగానే ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగితే 18 రోజులో, 16 రోజుల కిందనో (కొందరి ప్రచారం ప్రకారమే) సంఘటన జరిగితే బాలికను పనిలో పెట్టుకున్న కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిందా? చేస్తే ఏ స్టేషన్ లో చేశారు? చేయకుంటే ఇంత పెద్ద ఘటనను ఎందుకు దాచి పెట్టారు? ఇవీ ప్రశ్నలే.
– బాలికను ఆసుపత్రిలో చేర్చి తామే చికిత్స చేయిస్తున్నామని చెబుతున్నవారు ఆయా ఆసుపత్రికి రావాలంటే సంఘటన జరిగిన పరిధి వచ్చే వన్ టౌన్ పోలీసు స్టేషన్ గల మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని రోజుల్లో ఏదో ఒకరోజు పోలీసులకు కనీస సమాచారం ఇచ్చారా? గాయాలపాలైన బాలికను ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లకుండా, ప్రయివేట్ ఆసుపత్రినే ఎందుకు ఆశ్రయించారు? ఈ విషయం కూడా తేలాల్సి ఉంది.
– వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఓ బాలిక తమ వద్దకు చికిత్సకు వస్తే సంబంధిత ప్రయివేట్ ఆసుపత్రి నిర్వాహకులైనా పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇవ్వకపోతే… ఇటువంటి ఘటనలను దాచిపెట్టి చికిత్స జరపడం కూడా చట్టవ్యతిరేకం కాదా?
– నిజంగానే ప్రమాదవశాత్తు ఘటన జరిగితే రూ. 1.50 లక్షల మొత్తాన్ని బాధిత బాలిక కుటుంబానికి చెల్లించడానికి నిందితుని కుటుంబ బాధ్యులు ఎందుకు ముందుకు వచ్చినట్లు? అసలు నిందిత కుటుంబానికి గతంలోనూ ఏదేని నేర చరిత్ర ఉందా? బాలిక చెబుతున్న ఘటన జరిగిన రోజు నిందిత ఆరోపణలు గల కుటుంబంలోని మహిళలు అసలు ఇంట్లోనే ఉన్నారా? లేకుంటే వాళ్లు ఎక్కడికి వెళ్లారు? అనే అంశాలపైనా భిన్న ప్రచారం సాగుతోంది.
మొత్తంగా ఘటనపై పోలీసులు సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామాల్లోనే బాధితురాలు అబద్ధాలాడి, మాయచేసే అమ్మాయేనా? అంటూ కొందరు చేస్తున్న ప్రచారం ఎటువంటి సందేహాలను కలిగిస్తుంది? మరే సంకేతాలకు దారి తీస్తుంది? బాధిత బాలిక ‘గాయాలపై పేలాలు’ ఏరుకుంటున్నట్లు గోచరించదా మరి? కాదా ఇది బాధ్యతారాహిత్య ప్రచారం? పోలీసు విచారణను తప్పుదోవ పట్టించే కుటిల యత్నం కాదా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా పలువురి నుంచి ఉద్భవిస్తున్నాయి.