ఖమ్మం నగరం అట్టుడుకుతోంది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం, ప్రతిఘటించిన బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘోర ఘటనపై వామపక్ష పార్టీలు, దాని అనుబంధ సంస్థలతోపాటు బీజేపీ తీవ్రంగా స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న ప్రయివేట్ ఆసుపత్రి ముందు సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, బీజేపీ పార్టీలు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలకు చెందిన కార్యకర్తలు ధర్నాకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాలని నినదించారు.
ఈ పరిణామాల్లోనే పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఉషశ్రీ ఆసుపత్రికి వచ్చి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ పూజ తదితర ఉన్నత పోలీసు అధికారులతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి. మాలతి కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడారు. నిందితునిపై చట్టప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసన్నారు. ఘటనపై పోలీసు శాఖ స్పందించిందని, నిందితున్ని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
దాదాపు పదిరోజుల క్రితం జరిగిన ఈ దురాగత ఘటనను ts29 మాత్రమే వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రయివేట్ ఆసుపత్రి ముందు బాధితురాలికి న్యాయం చేయాలంటూ జరిగిన ఆందోళన, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తదితర అధికారులు ఆసుపత్రిని సందర్శించిన చిత్రాలను దిగువన చూడవచ్చు.