నమస్తే తెలంగాణా దినపత్రికకు ఖమ్మం యూనిట్ మేనేజర్ గా పనిచేస్తున్న పొనుగోటి రవీందర్ పైన, అతని సోదరుడు శ్రీనివాసరావుపైనా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన మేళ్లచెరువు ఉమామహేశ్వరరావు అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు రవీందర్, శ్రీనివాసరావులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తమకు తెలిసిన పొనుగోటి రవీందర్ అనే వ్యక్తి అతని సోదరుని పేరున రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పి, రూ. 12 లక్షల విలువైన సరుకులు తీసుకుని డబ్బు చెల్లించకపోగా, మోసం చేశారని, డబ్బు అడిగితే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని ఉమామహేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీందర్ పైన అతని సోదరుడు శ్రీనివాసరావుపైన తగిన చర్యలు తీసుకుని తనకు రావలసిన డబ్బు ఇప్పించాల్సిందిగా ఉమామహేశ్వరావు వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు.
ఈమేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు నమస్తే తెలంగాణా పత్రిక మేనేజర్ పొనుగోటి రవీందర్ పైన, అతని సోదరునిగా పేర్కొన్న పొనుగోటి శ్రీనివాసరావుపైన ఐపీసీ 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.