బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులందరూ నిరపరాధులేనని సీపీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. ఈ ఘటనలో బీజేపీ అగ్రనేతలు ఎల్ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, ఉమాభారతి తదితరులు సహా మొత్తం 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగింది కాదని, అందుకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పును చదివి వినిపించారు. నిందితులపై అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని, సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
దాదాపు 28 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు బీజేపీ నేతలకు, విశ్వహిందూ పరిషత్ నాయకులకు పెద్ద ఊరటను కలిగించిందనే చెప్పాలి. కాగా ఈ కేసులో మొత్తం 49 మందిపై అభియోగాలు నమోదు కాగా, విచారణ జరుగుతున్న క్రమంలోనే 17 మంది మరణించారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కరసేవకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.