పేల ద్వారా వ్యాపించే కాంగో జ్వరంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘కాంగో’ జ్వరంగా వ్యవహరించే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ వ్యాపించకుండా అలర్ట్ గా ఉండాలని పాల్ఘర్ జిల్లా పరిపాలనా విభాగం అధికార గణాన్ని అదేశించింది. కాంగో జ్వరం పరిణామం పశువుల పెంపకందారులకు, మాంసం అమ్మకం దార్లకు, పశు సంవర్ధకశాఖ అధికారులకు ఆందోలన కలిగించే అంశమని మహారాష్ట్ర అధికార యంత్రాంగం చెబుతోంది.
పాల్ఘర్ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి కాంబ్లే ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. కాంగో జ్వరం గుజరాత్ లోని కొన్ని జిల్లాల్లో కనుగొన్నారని, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగో జ్వరం ఓ నిర్దిష్ట పేల ద్వారా జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తుందని, ఇది సోకిన జంతువు మాంసాన్ని భుజించడం ద్వారాగాని, దాని రక్తం ద్వారాగాని మనుషులకు వ్యాపిస్తుందని చెప్పారు. కాంగో జ్వరం అంశంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర అధికారులు తమ సర్క్యులర్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.