పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలంగాణా జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. హన్మకొండలో నిర్వహించిన టీజేఎస్ ముఖ్యుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ గెలవాల్సిన అవశ్యకతను వివరించారు. మనం ప్రజల్లో ఉన్నామని, వాళ్ళకి మనకు తేడా చాలా ఉందన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినం, గెలిచినం. ఈ ఎన్నికల్లోనూ కొట్లాడాలి. ప్రయివేట్ టీచర్లు మనకోసం అనేక మంది వస్తారు. చిన్న చిన్న అపోహలు వద్దు, మనస్పర్థలు వీడాలి. తెలంగాణ రాజకీయాలు మలుపు తిప్పే సమయం వచ్చింది’ అని కోదండరాం అన్నారు. బలవంతులు కాదని, పక్క పలుచని వారే తెలంగాణా రాజకీయాలను మలుపు తిప్పుతారన్నారు. తెలంగాణ రాష్టం కోసం జెఏసీలు ఏ విధంగా పని చేశాయో, అదే స్థాయిలో పట్టభద్రుల ఎన్నికల్లో జేఏసీలుగా ఏర్పాటు కావాలన్నారు.
తెలంగాణ రాష్టంలో ఎల్ఆర్ఎస్ ను పేద ప్రజలపై భారం మోపేందుకు తీసుకొని వచ్చారని ఆరోపించారు. ప్రయివేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది కూడా టీఆర్ఎస్ నాయకుల కోసమేనని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నామని, పోటీలో ఉంటామని, మహబూబ్ నగర్ లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను సైతం ప్రకటిస్తామని, పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడే వారు పునరాలోచించి తమకు అవకాశం కల్పించాలని కోదండరాం కోరారు.