భారతావని గర్వించదగ్గ తొలితరం బాలీవుడ్ మహానటుడు పైడి జయరాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ లో పుట్టి, ప్రపంచ ప్రఖ్యాత బొంబాయి బాలీవుడ్ చలనచిత్ర ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి, మున్నూరుకాపు ముద్దుబిడ్డ, సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ అనీ, ఆయన చరిత్ర ఇంతకాలానికి వెలుగులోకి రావడం తెలంగాణ గడ్డ గర్వకారణమన్నారు. పాడి పంటలు పండించే కుటుంబంలో పుట్టి బాలీవుడ్ వరకు ఎదిగేందుకు పడిలేచిన కెరటం పైడి జైరాజ్ అన్నారు. 300 పైగా హిందీ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో సూపర్ స్టార్ గా ఎదిగిన పైడి జయరాజ్ బాలీవుడ్ రాజయ్యాడని కొనియాడారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ నుంచి వెళ్ళి ఎన్నో కష్టనష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని బొంబాయి సైన్మాలో జయకేతనం ఎగురవేసిన పైడి జైరాజ్ అభినందనీయుడన్నారు. భారతీయ వెండితెరపై తెలంగాణ వాడి వేడి చూపించిన దివంగత సూపర్ స్టార్ పైడి జైరాజ్ జయంతి జరుపుకోవడం ఆనందకరమన్నారు. ఇంతకాలం వెలుగులోకి రాని ఇలాంటి నటుడి చరిత్ర స్వరాష్ట్రంలో వెలుగు చూడటం మనందరికీ గర్వకారణమన్నారు. ఇందుకోసం కృషి చేసిన తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వాటర్ రీసెర్చ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వి. ప్రకాశ్, సీఎం గారి పీఆర్వో రమేశ్ హజారీ, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్, కొండా దేవయ్య పటేల్, కాసారపు రమేశ్, ఆకుల రవీందర్, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు పటేల్, వాయిస్ టుడే కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరుకాపు పత్రిక హైదరాబాద్ ఇన్ చార్జ్ లక్కాకుల రమేశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఫొటో: రవీంద్ర భారతిలో నిర్వహించిన పైడి జయరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస: గౌడ్ తతదితరులు