ఈ టీవీకి ఒకందుకు థాంక్స్ చెప్పుకోవాలి, ‘పాడుతా తీయగా…’ లాంటి ప్రోగ్రాంని పరిచయం చేసినందుకు. ఆ ప్రోగ్రాంలో ఎవరు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, నొటేషన్లు, అపస్వరాల లెక్క తర్వాత, ఆ ప్రోగ్రాం నేను బాలూ జడ్జిమెంట్ కోసం, బాలూ మాటల కోసం, విశ్లేషణ కోసం చూస్తాను .
ఈ రోజుకీ స్వరాభిషేకం టైముకి సిద్ధం.
పాట వెనుక కథలు తను చెప్పినంత ఆసక్తి కరంగా ఇంకెవరూ చెప్పలేరు. ఆ అద్భుత జ్ఞాపకశక్తి అబ్బురపరుస్తుంది. క్రీస్తు పూర్వం నాటి సంగతులు కూడా పేర్లు, డేట్లు, వారాలు, రోజులతో సహా గుర్తు పెట్టుకుంటాడా మనిషి.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ పాటల ప్రోగ్రాం లో అందరి కంటే బాలూ, శైలజ ఇద్దరూ చాలా క్రిటికల్ జడ్జ్ లు. పాటని ఎంత నిశితంగా, శ్రద్ధగా వింటారో ఇద్దరూ. పాట తరవాత, అతి చిన్న, మైన్యూట్ పొరపాట్లను చూపి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అంతకంటే శ్రద్ధగా వివరిస్తారు ఇద్దరూ.
ఏది పాడినా నిలబడి చప్పట్లు కొట్టేయడానికి కోటి తో సహా చాలా మందే ఉంటారు
బాలూ కంటే శైలజ జడ్జిమెంట్ మరీ కరెక్ట్ గా, సూటిగా, నిరంకుశంగా ఉంటుంది
చేతులు కట్టుకుని సీట్లో కూచుని, తల పంకిస్తూ పాటని శ్రద్ధగా వినే బాలూ మొహంలో, పాటలో ఒక తప్పు దొర్లగానే చిన్న నవ్వు చోటు చేసుకుంటుంది
ఎక్కడ ఎందుకు తప్పు దొర్లిందో, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో, ఎక్కడ ఊపిరి ఎక్కువ తీసుకుంటే, తర్వాత లైను ముక్కలు కాకుండా ఉచ్చరించగలుగుతారో, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ణ, శ, ళ అక్షరాలను ఎలా ఎందుకు సరిగా ఉచ్చరించాలో ప్రతి ఎపిసోడ్ లోనూ విసుగు చెందకుండా ప్రతి ఒక్కరికీ వివరిస్తాడు
చైతన్య ప్రసాద్ గారు నిన్న రాశారు “పలికే నాథుడు లేక ఎన్ని పదాలు కన్ను మూస్తాయో” అని
ఎంత కరెక్ట్ ఆ మాట. భాష మీద ప్రేమ, గౌరవం, పట్టింపు ఉన్న మనిషి కాబట్టే, బాలూ పాటతో పాటే బాలూ మాట కూడా మధురామృతమై నిలిచి పోయింది.
వాళ్లనీ వీళ్ళనీ తొక్కేశాడనే ఆరోపణ ఊహ తెలిసినప్పటి నుంచీ వింట్టూనే ఉన్నాం. బాలూ పాడుతా తీయగాలోనే చెప్పాడొక సారి “నేను ఎవరి దగ్గరికీ వెళ్ళి వాళ్లకీ వీళ్ళకీ అవకాశాలివ్వొద్దని చెప్పలేదు. నాకు వచ్చిన అవకాశాలను నేను వదులుకోలేదు” అని
అంతే ! సింపుల్
ఈ “తొక్కేసే” ఆరోపణ చేసే వారిలో ఎంతమందికి “సినిమా పాట” అంటే అవగాహన ఉందో తెలీదు. తొక్కేయబడ్డ వాళ్ళొచ్చి వీళ్ళకి చెప్పుకున్నారా అంటే అదీ ఉండదు. అక్కడా ఇక్కడా విన్న కబుర్లే.
ఒక సినిమా పాట పాడాలంటే చాలా స్కిల్ ఉండాలి. అడాప్టబిలిటీ ఉండాలి. పాట సందర్భాన్ని అన్వయించుకుని పాడగలిగే సత్తా ఉండాలి.
నవ్విందీ మల్లె చెండు పాటే దీనికి ఉదాహరణ. చిరంజీవి యవ్వనోద్రేకపు ఎనర్జీని పూర్తిగా ఆవిష్కరించిన పాటది.
ఒక్క మాటలో చెప్తే , సినిమా పాటకి వంద కాలిక్యులేషన్స్!!
ఈ స్కిల్స్ అన్నీ బాలూకి అబ్బినంతగా ఇంకెవరికీ అబ్బలేదు. అసలు ఇప్పటి యువ గాయకుల్లో కూడా ఎవ్వరికీ అంత స్కిల్ లేదు.
అది ఒక అరుదైన బహుముఖ ప్రజ్ఞ. కమర్షియల్ సినిమా రంగంలో అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి ఎదురుగా ఉంటే ఆయన్ని వదిలేసి కొత్త వాళ్ళ వెంట నిర్మాతలు పడక పోవడం సహజం. దాన్ని బాలూ మీదికి తోయడం మన అల్పత్వమే.
అందుకే ఆయన ఏళ్ళ తరబడి నిలబడ్డాడు. సినిమా సంగీతానికి సంబంధించి మెలొడీ, స్కిల్ రెండూ ముఖ్యం (స్కిల్ ఉన్నా మెలొడీ లేని శైలజ నిలబడిందా? లేదుగా ?)
16 భాషల్లో పాడిన మనిషి అన్ని భాషల్లోనూ సహ గాయకుల్ని తొక్కుకుంటూ పోడమే పనిగా పెట్టుకుంటే, పాడటం కంటే తొక్కడానికే టైం పెట్టాలి. బాలూ కి అంత టైముంటే ఇంకో రెండు పాటలెక్కువ పాడతాడు, ఆ టైపు.
ఒకటి మర్చిపోకూడదు ఎవరూ! టాలెంట్ ని ఎల్లకాలమూ ఎవరూ తొక్కలేరు. ప్రతిభ ఒక్కటే నిల్చి ఉండేది, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు.
మిగతావన్నీ బూడిద కుప్పల్లే కూలక మానదు, కాస్త ఆలస్యమైనా సరే.
ప్రతిభ ఉండీ, దాన్ని వెలుగులోకి తెచ్చుకోలేక “తొక్కేసే” ఆరోపణ చేస్తుంటే, ఈ పోటీ ప్రపంచంలో అది చాతగాని తనమే.
బాలూ, అరుదైన కళాకారుడు. బహుముఖ ప్రజ్ఞా శాలి. విశ్వ మానవుడు. దేశమంతా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆత్మీయుడు.
ఆయనకి ప్రాంతాలు, కులాలు, అభ్యుదయ వాదాల గొడవలు అంటగట్టడం మన కురచతనాన్ని, హ్రస్వ దృష్టిని ప్రపంచానికి చూపిస్తుంది తప్ప ఆయన కీర్తిని, విద్వత్తుని ఇసుమంతైనా తగ్గించ లేదు.
ద్వేషంతో ఆయనకి మసి పూయాలని చూస్తే అది అతనికి అంటదు. ఆ మసి మన కళ్లద్దాలకు మనం పూసుకున్నదే, ఆ నలుపులోంచి చూస్తూ, అది అతనికి అంటిందనుకోవడం భ్రమ.
విషం కక్కాలని చూస్తే, అదీ అతని వరకూ వెళ్లదు. అది మన మాస్కుల్లో మనం కక్కుతున్న విషమే,
మనకే మిగులుతుంది
ఈ చవకబారు వాదనలు తెచ్చే వారు గుర్తు పెట్టుకోవలసిన విషయం, “మనం గిరి గీసుకున్న ఆలోచనా పరిథి అవతల మరొక ప్రపంచం ఉంది”
అంతే కాదు , కళాకారులు ఈ వాదాలకు అతీతంగా తమ ప్రపంచంలో తాముంటారు.
బాలూ అయినా, బాపూ అయినా.
వారి కళే వాళ్ల ప్రపంచం
ఈ ద్వేషోద్యమ కారులెవరైనా ఆయన పాటని ఆస్వాదించకుండా ఉన్నారా? ఆ మాధుర్యంలో మునకలేయకుండా ఉన్నారా?
అయ్యా, అదే శాశ్వతం, ఆ పాటే శాశ్వతం
✍️ సుజాత వేల్పురి