అజ్ఞానం.. ఆపై అంతులేని మూఢ నమ్మకాలు… మగబిడ్డ మాత్రమే ఉద్ధరిస్తాడనే పిచ్చి భావనలు… వెరసి ఒక గర్భిణీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఉత్తర భారతదేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో జుగుప్సాకరమైన ఈ ఘటన నమోదైంది. ఇటీవల కాలంలో పెచ్చురిల్లుతున్న అనాగరిక ధోరణులు బాహ్య ప్రపంచం విస్తూపోయేలా చేస్తున్నాయి . అయిదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఒక నరరూప రాక్షసుడు తన భార్య కొడుకు ఎందుకు ఇవ్వడం లేదని మళ్ళీ ఆడపిల్ల పుడితే తనకు ఎంతో కీడు అనే జోస్యం గుడ్డిగా నమ్మాడు. తనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయా,అబ్బాయా అని తెలుసుకునేందుకు ఓ కసాయిభర్త భార్య కడుపును చీల్చి చూసే ప్రయత్నం చేశాడు.
ఉత్తర ప్రదేశ్ సివిలైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నాలాల్ (35) అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఏడునెలల గర్భిణి అనే కనీస జాలి కూడా లేని కరడుగట్టిన పాషాణం. ఇప్పటికే అయిదుగురు ఆడపిల్లల జననానికి కారణమైన నిందితుడు తనకు కొడుకు కావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. భార్య ఏడునెలల గర్భవతి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు పదునైన చాకుతో భార్య గర్భాన్ని చీల్చాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేని బాధితురాలి కేకలు వేసింది. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు చేసిన దారుణంపై సమాచారం అందుకున్న సిటీ ఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ , బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసు కునేందుకు భర్త పన్నాలాల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. అయితే ఆ అమాయకురాలి కడుపులో మగశిశువు ఉన్నట్లు పదునైన కత్తి అంచులు పిల్లవానికి లేత శరీరాన్నీ చీల్చివేయడంతో గర్భంలోనే ఆ పసికందు మృతిచెందినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ ప్రవీణ్ చెప్పారు.
✍️ ఎన్. జాన్సన్ జాకబ్ , మచిలీపట్నం.