పరువు హత్యకు గురైన హేమంత్ ఘటనలో 13 మందిని అరెస్ట్ చేశామని,మరొకరు పరారీలో ఉన్నారని మాదాపూర్ ఇంచార్జి డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదు చేశామని చెప్పారు. చందానగర్ తారానగర్ లో అవంతి, హేమంత్ ఉండేవారని, అవంతి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడన్నారు. ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, జూన్ నెల 11 వ తేదీన పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారని చెప్పారు.
కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని, చందానగర్ పోలీసులు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇచ్చి పంపించారని, కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత హేమంత్, అవంతి లు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే నిన్న మీతో మాట్లాడాలంటూ గచ్చిబౌలిలోని హేమంత్ నివాసానికి అవంతి కుంటుంబ సభ్యులు మూడు కార్లలో వచ్చారన్నారు. చందానగర్ వెళ్లాలని వారిని కారులో తీసుకువెడుతుండగా, అనుమానం రావడంతో అవంతి, హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నంచినట్లు డీసీపీ చెప్పారు.
ఈ ప్రయత్నంలో అవంతి మాత్రమే కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసిందని, మరో కారులో హేమంత్ ను అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి మరికొందరు తీసుకువెళ్లారని వివరించారు. ఘటనకు సంబంధించి హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారన్నారు. గోపనపల్లిలో నిన్న తొమ్మిది మందిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అర్ధరాత్రి అవంతి మేనమామ యుగందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ ను సంగారెడ్డి లో హత్య చేసి పడేసిన్నట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నామని మరొకరు పరారీలో ఉన్నారని డీసీపీ వెంకటేశ్వర్లు వివరించారు.
ఫీచర్డ్ ఇమేజ్: హత్యకు గురైన హేమంత్ (ఫైల్ ఫొటో)