ఒకప్పుడు జర్నలిస్టు అంటే మేధావితో పాటుగా మంచి రచయిత కూడా అయి ఉండేవాడు. అనేక రాజకీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, మానసిక, తాత్విక అంశాలపైన రచనలు చేసేవారు జర్నలిస్టులు. జర్నలిస్టు అనే పదానికి అర్ధం మారుతోంది. జర్నలిస్టు గురించి ప్రజల్లో అభిప్రాయం మారుతోంది.
ఒకప్పుడు జర్నలిస్టు మేధావి. ఉత్తమ నడవడికతో, ఉన్నతమయిన ఆలోచనలతో సమాజాభ్యున్నతి కోరి అందుకు నడుము కట్టినవాడు జర్నలిస్టు. అవినీతికి వ్యతిరేకి. అన్యాయాన్ని అడ్డుకునే వివేకి. ఉత్తమ ఆలోచనలు, ఉన్నత లక్ష్యమూ, భాషపైన పట్టు, రచనలో ప్రావీణ్యమూ, సామాజిక మనస్తత్వం పైన అవగాహన, చరిత్ర గురించి ఆలోచన, భూత వర్తమాన కాలాల సమన్వయంతో భవిష్యత్తుపైన దృష్టి కలిగి సమాజ హితం కోసం కలాన్ని ఆయుధంలా, సత్యాన్ని శస్త్రంలా వాడేవాడు జర్నలిస్టు అనే అభిప్రాయంవుండేది. జర్నలిస్టంటే సమాజంలో గౌరవ మన్ననలుండేవి.
ప్రపంచాన్ని ప్రజలకు చూపవలసిన జర్నలిజపు చూపుడువేలు వంకరలు తిరుగుతున్నది. వంకరలు తిరిగిన చూపుడువేలు మళ్ళీ తిన్నగా అవ్వాల్సిన అవసరంవుంది. ఇందుకు ప్రతి జర్నలిస్టు ఆత్మవిమర్శ చేసుకోవాల్సివుంటుంది. పిల్లి మెడలో గంట ఎవరో ఒకరు కట్టాలి. ప్రతివారూ పక్కవారు గంట కట్టాలనుకుంటారు. జర్నలిజం రంగంలో వున్న అవకతవకలను, అస్తవ్యస్తాన్ని, అవినీతినీ, అవలక్షణాలనూ ఎత్తి చూపించే పిల్లిమెడలో గంట కట్టటంలాంటి పనిని ఎవరు చేస్తారు?
శవాలపై చిల్లర ఏరుకొనే కొందరు పాత్రికేయులయ్యారు. డబ్బులిస్తే అన్యాయాలను మరుగున పెట్టి గులాబీ రంగు నోట్లకు గులాములయ్యారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసే కొందరికి సిగ్గులేని పెద్ద మనుషులు కొందరు వంగి వంగి దండాలు పెడుతున్నారు. రాసేవాడికి రాని కీర్తి పాత్రికేయ వృత్తిలో ఓనమాలు రానివాడికి దక్కుతోంది. కనీసం డిగ్రీ లేనివారు ఈ రంగంలో ఎందరో ఉన్నారు. పదవ తరగతి సైతం పాస్ కానీ వ్యక్తీ మీడియా కార్డు పుచ్చుకొని పెద్ద పెద్ద అధికారులను బెదిరిస్తున్నారు. కాసులిస్తే , ఎటువంటి అక్రమం అయినా దాచిపెట్టేస్తున్నారు. ఇక మన తెలుగునాట కొన్ని మీడియా సంస్థల అడ్వర్టయిజ్మెంట్ల దాహం… కొందరు రిపోర్టర్లకు వరంగా మారింది. ‘కలంకు కులం లేదని చలం ‘ అంటే కుల సంఘాలుగా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు తయారై వారి కులపోడైతే చాలు ఎటువంటి వెధవ పని చేసినా వెనకేసుకొస్తున్నాయి.
ఒక సమస్య వుంటే దాన్ని దాచి అది లేదన్నట్టు ప్రవర్తించటం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్యను సూటిగా ఎదుర్కోవాలి. నిక్కచ్చిగా కారణాలు వెదకాలి. నిర్మొహమాటంగా పరిష్కారాలు ఆలోచించాలి. నిర్భయంగా పరిష్కారాలను అమలుపరచాలి. అప్పుడు సమస్య పరిష్కారమవుతుంది. ఇది జరగనంత కాలం, అసలు రోగాన్ని కప్పిపెట్టి, పై పై లక్షణాలకు మందు వేస్తే అసలు రోగం పెరగటమే కాక, కొత్త రోగాలొస్తాయి !!
✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం.