మున్ముందు… అంటే రాబోయే రోజుల్లో రైలు ప్రయాణం ఎలా ఉండబోతోంది? అదేమిటీ రైలు ప్రయాణంలో ఏవేని అనూహ్య మార్పులు వస్తున్నాయా? అని ఆశ్చర్యపోకండి. బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా… అని తీసిపారేయకండి. ఇండియన్ రైల్వేలోని కొన్ని మార్గాల్లో ప్రయివేట్ రైళ్లు రాబోతున్నాయ్ తెలుసు కదా? ఆయా రైళ్లలో భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశంపై ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరు రాశారోగాని ఆసక్తికరంగానేకాదు, ప్రయివేట్ రైళ్ల తీరుతెన్నులపై ప్రయాణీకులను ముందే హెచ్చరించినట్లుగానూ ఉందీ పోస్ట్. సరదాగా మీరూ చదివేయండి.
భారతీయ రైల్వేలు ప్రైవేటీకరణ జరిగింది. ఒక ప్రయాణీకుడు టిక్కెట్టు కొనుక్కోవటానికి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళాడు.
ప్రయాణీకుడు: ఢిల్లీ నుండి లక్నోకు టిక్కెట్ ఇవ్వండి.
బుకింగ్ క్లర్క్: రూ. 750 ఇవ్వండి.
ప్ర: అదేంటి రూ. 400 కదా?
బు.క్ల: అవును. సోమవారం రూ. 400. శనివారం రూ. 700. ఆదివారం రూ. 750. మిగతా రోజుల్లో రూ. 600.
ప్ర: సరే, కింది బెర్త్ ఇవ్వండి.
బు.క్ల.: కింది బెర్తుకు రూ. 50 అదనం.
ప్ర. పోనీ, సైడున ఉండే కింది బెర్త్ ఇవ్వండి.
బు.క్ల: రూ. 25 అదనం.
ప్ర: చాలా ఎక్కువ. టాయిలెట్స్ లో నీళ్లు లేవు. పెట్టెలు శుభ్రంగా లేవు. టిక్కెట్ ధర మాత్రం చాలా ఎక్కువ.
బు.క్ల.; మీరు టాయిలెట్ వాడుకోవాలంటే రూ. 50 అదనంగా చెల్లించాలి. అదీ ప్రయాణం మొత్తంలో రెండు సార్లు మాత్రమే వాడుకోవచ్చు. అదనంగా వాడుకోవాలంటే ప్రతిసారి రూ. 10 రుసుము చెల్లించాలి.
ప్ర: ఇంకా దేని దేనికి చెల్లించాలో చెప్తారా?
బు.క్ల.: సెల్ ఫోన్ ఛార్జింగ్ కు గంటకు రూ. 10. హాండ్ బ్యాగ్ మాత్రమే అనుమతిస్తాం. అంతకు మించితే కిలోకు రూ. 20 లగేజీ చెల్లించాలి. ఇంటినుండి తెచ్చుకునే ఆహారాన్ని అనుమతించం. పాంట్రీ కార్ నుండి మాత్రమే ఆహారం కొనాలి. ఏరోజుకారోజు ధరలు మారతాయి.
ప్ర. ఇవన్నీ ఎవరు వసూలు చేస్తారు?
బు.క్ల: ప్రతి పెట్టెలో మా మార్షల్స్ ఉంటారు. వారు వసూలు చేస్తారు.
ప్ర. థాంక్స్. దీనికంటే విమానంలో వెళ్ళడం నయం.
బు.క్ల: అలాగే వెళ్ళండి. కానీ మానుండి ఈ వివరాలు పొందినందుకు కన్సల్టెషన్ చార్జీ కింద రూ. 100 చెల్లించి వెళ్ళండి. మా మార్షల్ మీ వెనుకే ఉన్నారు. ????