మల్లె పూవూ పరిమళం కలిసి పుట్టినట్టు
చీకటీ నలుపూ ఆవరించినట్టు
సూర్యుడు వెలుతురూ ప్రకాశించినట్టు
నేనూ నీవూ మమేకమై
సకల చరాచరుల మధ్య ఉద్భవించాం
నెత్తిన టోపీతో పాటు నీవు ఉన్నావ్
నూనూగు మీసాల ప్రాయంలోనూ నాతోనే నీవు
నఖాబ్ బిగించని బోసి నవ్వుల నుంచే
అవిభాజ్య ఆభరణంలా
నాలో లీనమై ఉన్నావ్ నువ్వు
రోహిణి ఎండలు విరగబడుతున్నట్లు
వరదలు పేద బతుకుల్తో చెలగాటమాడినట్లు
యవ్వనమంతా పీడకలల ముసురైపోయె
మాగన్నులో ఉలిక్కిపాట్లను నాకొదిలి
మౌనంగా నిర్దయగా ఎక్కడో తప్పుకున్నావ్
పాలపీకను పోగొట్టుకున్న పసిగుడ్డులా
నాలాగే లోకమంతా నిన్ను
అలసటలేని వలస కూలీలా వెతుకుతూనే ఉంది
సిరియాలో చిక్కుకున్నావేమోనని భూతద్దమేస్తే
చితికిన పసిమొగ్గల తోట
కంట్లో రక్తం కురిపించింది
ప్రపంచమంతా సాగిలపడే
అగ్రరాజ్యంలో అరెస్ట్ చేసారా నిన్ను
ఆ పక్కనే ఇరాక్ లో అడుగుపెట్టావా
బాంబులు, తుపాకుల హోరుకు ఏనాడో విడిచిపెట్టావేమో
కంట్లో నలకైనా కాలేదు
ఇదిగో పాలసంద్రాన్ని చిలికిన మీగడ
మా కాశ్మీర్
నీకు ప్రతీక
బంకర్లలోనూ లేదు నీ దర్శనం
ఆకుపచ్చని కఫన్ కప్పుకుని
గుజరాత్ ఖబ్రస్తాన్ లో విశ్రమించావా
ఇదిగో
లోతుల్లోకి వెళ్ళి నిర్జీవమైన నా కళ్ళు చూడు
నీ వలపోతలో వాడిన నా ముఖాన్ని చూడు
సంద్రంలో చిక్కిన నాకు దుఃఖాన్ని మిగల్చకు
నీ ప్రతిరూపంగా నన్ను తయారు చేసి
అనాధలా మిగిల్చి మాయమయ్యావ్
ఎక్కడ కొలువయ్యావ్
దండకారణ్యాల వెతుకులాటా అయింది
సముద్రంపై చిక్కటి నలుపులో మేఘం
నువ్వేనా..
నీవు లేని సమస్తం
తల్లి లేని బిడ్డలా గుక్క పట్టింది
ఎప్పుడొస్తావ్?
✍️ నస్రీన్ ఖాన్
(సెప్టెంబర్ 21, ప్రపంచ శాంతి దినోత్సవం)