కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ ఓ జిల్లా కలెక్టర్ నేరుగా వైరస్ సోకిన బాధితుల ఐసొలేషన్ వార్డులోకి వెళ్లడం విశేషాంశంగా మారింది. తెలంగాణాలో ఐసొలేషన్ వార్డులోకి వెళ్లిన తొలి కలెక్టర్ బహుషా ఇతనే కావచ్చంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పీపీఈ కిట్ ధరించి శుక్రవారం నేరుగా స్థానిక ఏరియా ఆసుపత్రిలోని కరోనా ఐసొలేషన్ వార్డులోకి వెళ్లారు. ఈ సందర్భంగా బాధితుల యోగ, క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారిలో ధైర్యాన్ని నింపారు. అంతా సర్దుకుంటుందని, వైద్య సేవల విషయంలో అసౌకర్యాలు ఉంటే తనకు చెప్పాలని బాధితులను కోరారు.
మానుకోటలోని ఏరియా ఆసుపత్రికి కలెక్టర్ గౌతమ్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీంసాగర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పీపీఈ కిట్ ధరించి వైద్యులతో కలిసి కరోనా వార్డులోకి వెళ్లారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి బాధితులతో సంభాషించారు.
కరోనా బారిన పడినవారిని అయినవాళ్లే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్ తమ వద్దకు వచ్చి తమను పలకరించడం, అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవడం, తమకు ధైర్యాన్ని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని బాధితులు ఈ సందర్భంగా సంబురపడ్డారు.
ఫొటో: మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్