నాలాను దురాక్రమించి ఓ ఎమ్మెల్యే నిర్మించిన కట్టడంపై వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు కొరడా ఝుళిపించారు. హన్మకొండ-వరంగల్ మధ్య గల హంటర్ రోడ్డు మార్గంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నాలాను ఆక్రమించి అక్రమంగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తన కార్యాలయం అక్రమంగా నిర్మించినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గతంలోనే బల్దియా అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే వరంగల్ మున్సిపల్ అధికారులు బుధవారం హంటర్ రోడ్డులోని నాలాపై గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జేసీబీ యంత్రంతో కూల్చివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ మహా నగరం అతలాకుతలమైన పరిస్థితుల్లో నాలాల దురాక్రమణ, అక్రమ కట్టడాల బాగోతంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో నాలాపై నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు కట్టడాన్ని అధికారులు కూల్చివేయడం సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది.