ఇది వేలం పాట కథ కాదు. రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారుల అవినీతి ‘కత’. ఈ శాఖ సార్లు కొందరు ఏటేటా లంచం పాట పెంచుతూనే ఉన్నారు. ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో కీసర ఎమ్మార్వో నాగరాజు రూ. 1.10 కోట్ల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ రికార్డు అధికారులను అభ్యర్థించాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్ డాలర్ల (రూ. 1.10 కోట్లు) లంచంగా స్వీకరిస్తూ పట్టుబడడం ఇదే తొలిసారని, అందువల్ల ఆయన పేరును గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలని ఆయా స్వచ్ఛంద సంస్థలు కోరాయి. అయితే తమ రికార్డుల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరీ లేదని, అందువల్ల ఈ అంశంలో కొత్త కేటగిరీని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ రికార్డు అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి రికార్డును బద్దలు కొట్టారు. ఈమేరకు నాగరాజు కన్నా ఓ రెండు లక్షలు ఎక్కువకే అవినీతి బేరం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మొత్తం 112 ఎకరాల పట్టా భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు ఎకరానికి రూ. లక్ష మొత్తాన్ని లంచంగా రేటు నిర్ణయంచారుట. అంటే అక్షరాల కోటి పన్నెండు లక్షల రూపాయలన్నమాట. ఇందులో రూ. 40 లక్షల మొత్తాన్ని తన బినామీ జీవన్ గౌడ్ ద్వారా అడ్వాన్సుగా స్వీకరించిన అదనపు కలెక్టర్ నగేష్ మిగతా రూ. 72 లక్షల చెల్లింపుల కోసం ఏకంగా ఐదెకరాల భూమికి ‘టెండర్’ పెట్టారు. ఈ భూమిని కూడా తన బినామీ జీవన్ గౌడ్ పేరు మీదే రిజిస్ట్రేషన్ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. సరే ఇదంతా నిన్నటి ‘కతే’… రాష్ట్ర అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్న సమయంలోనే అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కడం కాకతాళీయమే కావచ్చు.
ఇక అసలు విషయమేమిటంటే… రెవెన్యూ శాఖకు చెందిన ఇటువంటి ‘సర్కారు సారు’వారి అవినీతి పాట ఏయేటికాయేడు పెరిగిపోతుండడమే. గడచిన దశాబ్ధ కాలంలో రూ. 1.10 కోట్ల నగదు మొత్తాన్ని టోకున లంచంగా స్వీకరించిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఘటన ఓ రికార్డు కాగా, అంతకన్నా ఓ రెండు లక్షలు ఎక్కువకే అదనపు కలెక్టర్ నగేష్ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. నగదు మాత్రమే స్వీకరణ అనే పాయింటును ప్రామాణికంగా చూసినపుడు మాత్రం కీసర ఎమ్మార్వో రికార్డును ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదనే చెప్పాలి. అవినీతిలోనూ ‘ఒప్పందం’ అనే అంశాన్ని తీసుకున్నపుడు మాత్రం మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ బాగోతం సరికొత్త రికార్డుగానే భావించవచ్చు. గడచిన దశాబ్ధ కాలంలో రెవెన్యూ అధికారుల ‘అవినీతి పాట’ రూ.లక్ష నుంచి కోట్లకు పెరగడమే కొసమెరుపు. అదీ ‘సర్కారు సారు వారి పాట’ కథా కమామీషు!
ఫొటో: నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు