యాధృచ్ఛికమే కావచ్చు… కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలోనే అదే శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అవినీతి నిరోధక శాఖకు చిక్కడం విశేషం. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. కీసర ఎమ్మార్వో నాగరాజు ఉదంతాన్ని మరిపించే విధంగా రూ. 1.12 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీకి చిక్కారు.
ఓ భూ వివాదంలో ‘నో ఆబ్జెక్షన్’ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చేందుకు ఆయా భారీ మొత్తాన్ని అదనపు కలెక్టర్ డిమాండ్ చేశారని, బాధిత రైతు మూర్తి ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్ ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆడియో క్లిప్పులు సహా నగేష్ ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తోంది. అంతేగాక చెక్కుతోపాటు ప్రామిసరీ నోటు కూడా రాసుకున్నట్లు సమాచారం. మాచవరంలోని నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంతో మరికొందరు రెవెన్యూ అధికారులకు సంబంధమున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ సంచలన ఘటన నేపథ్యంలోనే నర్సాపూర్ ఆర్డీవో బండ అరుణారెడ్డి కార్యాలయంలో మరోవైపు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు ఆర్డీవో రూ. 40 లక్షల మొత్తాన్ని లంచంగా అడిగారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అరుణారెడ్డికి చెందిన పలు ప్రాంతాల్లోని నివాసాల్లోనూ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి నర్సాపూర్ తహశీల్దార్ మాలతి, డిప్యూటీ ఎమ్మార్వో, చిప్పతుర్తి వీఆర్వోను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చరిత్రాత్మక రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయా తాజా ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఫొటో: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్