తెలంగాణాలో మరోసారి స్పెషల్ రివార్డ్ (ఎస్ఆర్) ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు కాబోతున్నదా? ఇందుకోసం ప్రభుత్వం మళ్లీ ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవశ్యకత ఏర్పడిందా? ఔననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని అనేక జిల్లాల్లో మావోయిస్టుల తాజా కదలికలే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గోదావరి పరీవాహక ప్రాంత అటవీ జిల్లాల్లో ఏర్పడిన తాజా పరిస్థితులు, పరిణామాలు ఇందుకు ఊతం కల్పిస్తున్నాయనే వాదన వినిపిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ నిధుల కేటాయింపు, అందుకు ఉపకరించే ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థ భారీ సంఖ్యలో ఉండేది. నక్సలైట్ల కదలికల ఆచూకీ కోసం గతంలో ఈ వ్యవస్థను బలోపేతంగా నిర్మించారు. వ్యవహారికంలో దీన్ని ‘పోలీస్ ఇన్ఫార్మర్’ వ్యవస్థగా పిలిచేవారు. నక్సల్ పార్టీలకు చెందిన మిలిటెంట్లను, మాజీలను కొందరిని ఎస్పీవోలుగా నియమించేవారు. ఫలితంగానే అన్ని తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాల కట్టడిలో పోలీస్ శాఖ విజయవంతమైందనే వాదనలు ఉండనే ఉన్నాయి.
నక్సల్స్ అణచివేతలో పలువురు పోలీసులు కూడా ప్రాణత్యాగం చేసిన ఘటనలు అనేకమన్నది కాదనలేని వాస్తవం. కానీ ఎస్పీవోల వ్యవస్థ కూడా నక్సల్స్ అణచివేత అంశంలో పోలీసు శాఖకు భారీగానే ఉపకరించిందని చెప్పక తప్పదు. దాదాపు దశాబ్ధ కాలంగా ఈ ఎస్పీవోల వ్యవస్థతో పోలీసు శాఖకు పెద్దగా పని లేకుండాపోయింది. ప్రభుత్వం కూడా ఎస్ఆర్ ఫండ్ కింద నిధులు విడుదల చేయడం గణనీయంగా తగ్గిపోయింది. కొంతకాలంగా నామమాత్రపు కేటాయింపులు కూడా లేవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణాలో నక్సల్ కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని భావించిన పరిస్థితులే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
కానీ మళ్లీ ఎస్పీవోల అవసరం, ఎస్ఆర్ ఫండ్ వినియోగంపై పోలీసు శాఖ దృష్టి కేంద్రీకరిస్తోందంటున్నారు. ‘ఎస్ఆర్ ఫండ్’ అంటే స్పెషల్ రివార్డు నిధి అన్నమాట. ఆయా జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలు, సంచరించే నాయకుల స్థాయిని బట్టి ఎస్ఆర్ ఫండ్ కేటాయింపు ఉంటుంది. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి లక్షల్లోనే కాదు, రూ కోట్ల మొత్తంలోనూ ఎస్ఆర్ ఫండ్ ఉంటుంది. ఈ ఎస్ఆర్ ఫండ్ కు ఎటువంటి ఆడిట్ గాని, అకౌంట్స్ నిర్వహణగాని ఉండదు. నిధుల వినియోగానికి సంబంధించి ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. సంబంధిత జిల్లాల ఎస్పీల ఆధీనంలో ఈ నిధులు ఉంటాయి. ఎస్పీలుగా విధులు నిర్వహించే ఐపీఎస్ అధికారులకు ఈ డబ్బును వ్యయం చేసే విషయంలో విచక్షణాధికారం ఉంటుంది.
వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా ఎస్ఆర్ ఫండ్ ను పంపిణీ చేస్తుంటారు. స్థానిక స్టేషన్ల పోలీసు అధికారులు ఈ డబ్బును ఎస్పీవోలకు చెల్లిస్తుంటారు. తాము నియమించుకున్న ఎస్పీవోలకు అంటే ఇన్ఫార్మర్లకు స్థానిక పోలీసు అధికారులు నిర్ణీత మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేస్తుంటారు. గతంలో ఒక్కో ఇన్ఫార్మర్ కు రూ. 6 నుంచి 8 వేల మొత్తం వరకు చెల్లించేవారు. కానీ ఇన్ఫార్మర్ల పేర్లు ఎక్కడా రికార్డుల్లో ఉండవు. XYZ పేరుతో చెల్లింపులు చేస్తుంటారు. తమ ప్రాంతంలో నక్సల్ కదలికల గురించి ఎస్పీవోలు ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు సమాచారాన్ని అందిస్తుంటారు. అందుకే వారికి ఈ చెల్లింపులు అందుతుంటాయి. ఈ అంశంలో భారీ విజయం సాధించిన సందర్భంలో చెల్లింపు మొత్తాల్లో వ్యత్యాసం కూడా ఉంటుంది.
గడచిన దశాబ్ధ కాలంగా నక్సల్ కార్యకలాపాలు పెద్దగా లేకపోవడంతో ఎస్పీవోల వ్యవస్థను పోలీసు శాఖ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఇంకోవైపు ఎస్ఆర్ ఫండ్ కేటాయింపులు సైతం ప్రభుత్వం నుంచి పెద్దగా మంజూరు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం మళ్లీ ఎస్పీవోల అవసరం, ఎస్ఆర్ ఫండ్ వినియోగం పోలీసు శాఖకు ఏర్పడింది. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లో మావోయిస్టు నక్సల్స్ కదలికలు, తాజా ఘటనల నేపథ్యం ఆయా అవసరాల అవశ్యకతను గుర్తు చేస్తోందంటున్నారు. దీంతో పోలీసు శాఖ మళ్లీ ఎస్పీవోల నియామకం వైపు అడుగులు వేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది. అంటే మళ్లీ తెలంగాణాలో ‘పోలీస్ ఇన్ఫార్మర్’ వ్యవస్థ పునర్ నిర్మాణానికి ఆ శాఖ నడుం కడుతున్నట్లే లెక్క. ప్రభుత్వం కూడా ఎస్ఆర్ ఫండ్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.