తెలంగాణా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పరిపాలనా పరంగా కేసీఆర్ సర్కార్ ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది? ఒకేరోజు రెండు అనూహ్య నిర్ణయాలు. రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోల నుంచి ఉన్నఫళంగా రికార్డులు స్వాధీనం చేసుకోవాలనే ఆదేశాలు. మధ్యాహ్నం మూడు గంటల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసి, సాయంత్రం అయిదున్నర గంటలకల్లా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్వోల నుంచి రికార్డుల స్వాధీనపు ప్రక్రియ కొనసాగతోంది.
ఈ సంఘటన నుంచి ప్రభుత్వ వర్గాలు, ముఖ్యంగా రెవెన్యూ అధికార విభాగం తేరుకోకముందే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. నిలిపివేయడమంటే పూర్తిగా కాదని కూడా అంటున్నారు. వీలునామా, గిఫ్ట్ డీడ్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయంటున్నారు. ఇంకోవైపు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఉత్తర్వు వెలువడే వరకు ‘సెలవు’ ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయా పరిణామాల నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? సీఎం కేసీఆర్ పాలనాపరంగా ఎటువంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై భిన్న ప్రచారం జరుగుతోంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి కొంతకాలంగా సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం వీఆర్వోల నుంచి రికార్డులను ఉన్నఫళంగా స్వాధీనం చేసుకున్నారంటున్నారు. వాస్తవానికి వీఆర్వోల వద్ద పెద్దగా రికార్డులంటూ ఏమీ ఉండవు. పహణీ బుక్ తో పాటు ఎంక్వయిరీ పిటిషిన్లు మాత్రమే ఉంటాయి. వీటినే ప్రభుత్వం సోమవారం స్వాధీనం చేసుకుంది. అయితే వీఆర్వోలను ప్రభుత్వం ఏం చేయనుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తం వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, వారిని పంచాయత్ రాజ్, వ్యవసాయ శాఖలో సర్దుబాటు చేస్తారంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఈ రాత్రికల్లా వెలువడుతుందని, మంగళవారం వీఆర్వోలకు శాఖల మార్పుపై ‘ఆప్షన్లు’ కూడా ఇస్తారంటున్నారు.
మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖ విషయంలోనూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. రెవెన్యూ వ్యవస్థలో తీసుకువచ్చే మార్పులకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖను కూడా మార్చనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక్కో జిల్లాలో సగటున రెండు నుంచి మూడు రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఎత్తివేయవచ్చనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను పూర్తిగా తహశీల్దార్లకు అప్పగించే యోచన కారణంగా వీటిని రద్దు చేస్తారంటున్నారు. కేవలం వ్వవసాయేతర, భవనాల రిజిస్ట్రేషన్ అధికారాలను మాత్రమే రిజిస్ట్రార్ అధికారులకు అప్పగిస్తారని సమాచారం. మొత్తంగా అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖల అంశంలో తెలంగాణా సర్కార్ అవలంభిస్తున్న వైఖరి, తీసుకునే నిర్ణయాలపై అధికార వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠతో కూడిన ఆసక్తి నెలకొంది.
ఫొటో: వరంగల్ తహశీల్దార్ కు రికార్డులు అప్పగిస్తున్న వీఆర్వోలు