స్టార్ మా టీవీ బిగ్ బాస్ షోలోకి అడుగిడిన యూట్యూబ్ స్టార్ గంగవ్వ కులాన్ని ఓన్ చేసుకునే ప్రక్రియ సోషల్ మీడియాలో మొదలైంది. గంగవ్వ ఫలానా కులం బిడ్డగా పేర్కొంటూ వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టుల గోల సాగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన గంగవ్వ ‘మై విలేజ్ షో వీడియోల ద్వారా యూ ట్యూబ్ స్టార్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. గంగవ్వ ప్రస్థానం గురించి మళ్లీ మళ్లీ చెప్పడమంటే ‘సోది’ చెప్పినట్లుగానే ఉంటుంది. ‘గూగుల్’లో వెతికితే ఆమె వివరాలు మొత్తం కనిపిస్తాయి. కొత్తగా చెప్పడానికేమీ లేదు. గంగవ్వ బిగ్ బాస్ షోలో ఎంపికై, అడుగిడిన అంశం మాత్రమే తాజా విశేషం.
యాభై ఏడేళ్ల వయస్సులో యూ ట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా లంబాడిపల్లె నివాసి. ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంటరైన గంగవ్వ ‘కులం’ గురించి సోషల్ మీడియాలో తాజాగా చర్చ జరగడమే విచిత్రం. కుల ప్రాతిపదికన గంగవ్వ బిగ్ బాస్ షో కంటెస్టెంట్ వరకు వెళ్లలేదనే విషయాన్ని మర్చిపోయిన కొందరు ఆమె సామాజిక వర్గాన్ని ఉటంకిస్తూ ఓట్లు కోరడం గమనార్హం. గంగవ్వలో చూడాల్సింది కులం కాదని, ఆమె తన సహజ టాలెంట్ సంపాదించుకున్న పాపులారిటీని మాత్రమే అనేది నిర్వివాదాంశం.