తెలంగాణా డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఈనెల 2వ తేదీన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఇప్పటి వరకు అక్కడే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల కట్టడికి తీసుకోవలసిన చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు ఆయన దిశా, నిర్దేశం చేశారు. పోలీస్ శాఖ బాస్ గడచిన ఐదు రోజులుగా ఒకే ప్రాంతంలో మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నేపథ్యంలోనే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనను ముగించుకుని ఆదివారం హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె శశాంక, మున్సిపల్ కమిషనర్ వి క్రాంతిలు డీజీపీ మహేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం అధికారిక గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో వందేళ్లకు పైబడి నిర్మితమై ఉన్న గోల్ బంగ్లాను ఆధునీకరించి అతిథుల లాంజ్ భవనం గా తీర్చిదిద్దిన నిర్మాణాన్ని ఆదివారం సాయంత్రం డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పురాతనమైన భవనాన్ని ఆధునీకరించడం, పచ్చిక బయళ్లతో, వాటర్ ఫౌంటెన్లతో ఆహ్లాద వాతావరణం పొందేలా తీర్చిదిద్దిన పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డిని డీజీపీ అభినందించారు.
అనంతరం డీజీపీ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమిషనర్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో తీసుకుంటున్న పలు చర్యలను అభినందించారు.
ఫొటో: డీజీపీ మహేందర్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి