కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రికి బయలుదేరిన ఓ బాధితురాలపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన దురాగతమిది. కేరళలోని పతనంతిట్టలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలిన బాధితురాలు (19)తోపాటు ఆమె తల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు 108 సేవలను ఆశ్రయించారు. ముందుగా యువతి తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన 108 అంబులెన్స్ డ్రైవర్ ఆ తర్వాత 19 ఏళ్ల వయస్సు గల యువతిని ఇంకో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చాడు.
అయితే మార్గమధ్యంలో 108 వాహనాన్ని దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కరోనా బాధితురాలైన యువతిపై డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా, డ్రైవర్ దురాగతాన్ని బాధితురాలు ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. ఈ ఘోరానికి పాల్పడిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫల్ (29)ను పోలీసులు అరెస్ట్ చేయగా, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ఆదేశించారు. డ్రైవర్ ను 108 అంబులెన్స్ విధుల నుంచి తొలగించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.