ఇంతకీ ‘ఆచార్య’ ఎవరు! కరీంనగర్ ‘కమాన్’ను పోలిన ధర్మస్థలి సెట్టింగ్ కథేంటి? – 2
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మితమవుతున్న ‘ఆచార్య’ సినిమా కథ కాపీనా? కాదా? అనే వివాదాంశంలోకి వెళ్లకుండా, ఆయన ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర గురించి ఇంతకు ముందు కథనంలో సశేషంగా చెప్పుకున్నాం కదా! ఇది మిగతా భాగం. కొరటాల శివ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర నడి వయస్సు నక్సలైట్ గా వార్తలు వచ్చాయి. అదే సమయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై ఆయన పోరాటాం చేస్తారన్నది ఈ వార్తాల సారాంశం.
అసలు నక్సల్స్ కు దేవాదాయ శాఖకు సంబంధించిన అవినీతి అంశానికి లింకేమిటి? కేవలం అవినీతిపైనే నడి వయస్సు నక్సల్ పాత్రలో గల చిరంజీవి పోరాటం చేస్తారా? లేక దేవాదాయ శాఖకు చెందిన భూముల పంపిణీ కోసం సాయుధంగా పోరాడుతారా? ఇవీ సందేహాలు. ఎందుకంటే దేవాదాయ శాఖకు చెందిన భూములకు సంబంధించి ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీతోపాటు చండ్రపుల్లారెడ్డి గ్రూపునకు చెందిన వివిధ విప్లవ గ్రూపులు కూడా పోరాడాయి.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో, నక్సల్స్ ఆధిపత్యం కొనసాగిన కాలంలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు దేవాదాయ శాఖ భూములపై నక్సలైట్లు భారీ పోరాటమే చేశారు. ముఖ్యంగా అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ ఈ అంశంలో మిగతా తీవ్రవాద గ్రూపులకన్నా గట్టి పోరాటమే చేసినట్లు పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాచలం వరకు గల అనేక దేవాలయాల భూములను పేదలకు పంచాలనే డిమాండ్ అప్పట్లో నక్సల్స్ నుంచి వచ్చింది.
ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఓ రాజకీయ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు దేవాలయ భూములను పెద్దఎత్తున దురాక్రమణ చేశారని, వాటిని పేదలకు పంచాలని మావోయిస్టు నక్సలైట్లు బహిరంగ ప్రకటనల ద్వారా డిమాండ్ కూడా చేశారు. ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో లభించిన స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కాలంలో నిర్వహించిన ‘భూ పంపిణీ’ ప్రక్రియలో నక్సల్స్ పేదలకు పంచిన భూములు ఎక్కువగా దేవాదాయశాఖకు చెందినవిగానే అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాలో కథాంశం దేవాదాయ శాఖకు సంబంధించిన వ్యవహారమైతే, ఇందులో చిరంజీవి పోషించే నడి వయస్కుడైన నక్సల్ నేత పాత్ర ఎవరిదనేది మరో ఆసక్తికర అంశం. ‘ఆచార్య’ అని సహజంగా మనం ఎవరిని సంబోధిస్తాం? గురువులను ‘ఆచార్యా!…’ అంటుంటాం. అందువల్ల పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన కొండపల్లి సీతాారామయ్య అలియాస్ కేఎస్ పాత్రను దర్శకుడు కొరటాల శివ ఇందులో చూపించబోతున్నారా? అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీకి కొండపల్లి సీతారామయ్య ‘ఆచార్య’ వంటి వారేనని విప్లవ కార్యకలాపాల పరిశీలకులే కాదు, ఓ రిటైర్డ్ పోలీసు అధికారి కూడా ప్రస్తావించడం ఈ సందర్భంగా గమనార్హం.
కానీ ఆచార్య చిత్రం ‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్’లో చూపిన ‘ధర్మస్థలి’ సెట్టింగ్ కరీంనగర్ ‘కమాన్’ను పోలి ఉంది. అందువల్ల కరీంనగర్ కేంద్రంగా విప్లవోద్యమంలో ప్రవేశించి మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పాత్రను చిత్ర దర్శకుడు కొరటాల శివ చిత్రంలో చూపించబోతున్నారా? ఇది మరో సందేహం. ఎందుకంటే ‘ఆచార్య’ అనే టైటిల్, నక్సల్ నాయకుడి పాత్రలో చిరంజీవి అనే పాయింట్లు ఇందుకు తావు కల్పిస్తున్నాయి.
గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU)లో పనిచేసినప్పటికీ, తర్వాత ఉపాధ్యాయ కోర్సు చేసి 1972లో ప్రభుత్వ టీచర్ గా నియమితులయ్యారు. తొలుత కరీంనగర్ సమీపంలోని ఎలగందుల పాఠశాలలో, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు స్కూల్లో పని చేశారు. కొంతకాలానికి 1976లో ప్రస్తుత సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రుద్రంగి పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న కాలంలోనే బీఈడీ సీటు రావడంతో వరంగల్ వెళ్లారు. ఇదే సమయంలో మళ్లీ RSUలో చేరి ఉద్యమబాట పట్టారు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అనంతర పరిణామాల్లో ఆయన మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనపై దాదాపు రూ. 3.50 కోట్ల ప్రభుత్వ రివార్డు ఉండడం గమనార్హం. ఆయా పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ‘గణపతి’ పాత్రను కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాలో చూపించబోతున్నారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ టీచర్ గా పనిచేసిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావును కూడా ‘ఆచార్య’గానే చెప్పక తప్పదు.
మొత్తంగా చిరంజీవి ’ఆచార్య’ సినిమాలో నడి వయస్కుడైన నక్సల్ లీడర్ పాత్ర ఎవరిని పోలి ఉంటుంది? అది కొండపల్లి సీతారామయ్యా? లేక గణపతా? లేక పూర్తిగా కల్పిత కథనానికి ‘నక్సల్’ అనే పాయింట్ ను జోడించి పూర్తిగా కమర్షియల్ సినిమా తీస్తున్నారా? అనే అంశం తేలాలంటే చిత్రం విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో చిరంజీవి పోషించే పాత్ర ఎవరిదైనప్పటికీ, మెడలో ఎర్ర తువ్వాలు, ఆలీవ్ గ్రీన్ దుస్తులు ధరించిన నక్సల్ నేత పాత్రధారి చేతిలో ఏకే-47 వంటి తుపాకీ కాకుండా ‘కత్తి’ని పోలిన ఆయుధం ఉండడం గమనించాల్సిన అంశం.