జర్నలిజం ముసుగులో కొందరు చేసే దందాకు ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దాదాపు ఇరవై రోజుల క్రితం జరిగిన ఈ ఉదంతంలో పాత్రికేయుల ముసుగులో కొందరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారనే విషయం ఆలస్యంగా బహిర్గతమైంది.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం… అక్రమంగా మద్యం, ఇసుక రవాణా నియంత్రణ కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 8వ తేదీన తెలంగాణా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఈబీ పోలీసులు ఇబ్రహీం పట్నం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 1,114 మద్యం బాటిళ్లు, మూడు కార్లు, ఒక లారీ, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే అంశాలు వెలుగు చూశాయి. ఓ ముగ్గురు వ్యక్తులు పైలట్ తరహాలో కారులో ప్రయాణిస్తుంటారు. వారి వెనకాలే తెలంగాణా నుంచి సిమెంట్ లోడు పేరుతో ఓ లారీ వస్తుంటుంది. ఇదే లారీలో తెలంగాణాలో కొనుగోలు చేసిన మద్యం నిల్వలు కూడా ఉంటాయి. విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు మరో కారులో కీసర టోల్ గేట్ వద్ద వేచి ఉంటారు. మద్యం తరలిస్తున్న లారీని, పైలట్ కారును కూడా కీసర టోల్ గేట్ వద్ద వేచి ఉన్న వ్యక్తులు ఫాలో అవుతుంటారు. లారీ, పైలట్ కారులో గల నలుగురు వ్యక్తులను కీసర టోల్ గేట్ వద్దనుంచి ఫాలో అయిన కారులోని వ్యక్తులు బెదిరించేందుకు పథక రచన చేస్తారు.
ఇందులో భాగంగానే ‘ప్రెస్’ ముసుగులో, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్న కొందరికి కీసర టోల్ గేట్ వద్ద నుంచి ఫాలో అయిన కారులోని వ్యక్తులు సమాచారం అందిస్తారు. విలేకరుల ముసుగులో గల ఆరుగురు వ్యక్తులు ‘ప్రెస్’పేరుతో లారీని, పైలట్ కారును అటకాయించి మద్యం బాటిళ్లను తీసుకుంటారు. ఈ సందర్భంగా డిమాండ్ చేసిన నగదు కోసం వేచి ఉంటారు.
ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు రంగంలోకి దిగి పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీ ఘటనలో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించగా, ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే మొత్తం నిందితుల్లో ఆరుగురు వ్యక్తులు తాము యూ ట్యూబ్ ఛానళ్ల విలేకరులుగా పోలీసులకు తెలపడం గమనార్హం.
ఆలకుంట విజయ్, దాసరి రమేష్, కుంచన శ్రీనివాస్, మొగల్ అలియాస్ బేగ్, వేముల గోపి, నుట్ట మోహన్ సాయిలు అనే వ్యక్తులు యూ ట్యూబ్ ఛానల్ విలేకరులుగా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయకుండా, స్వలాభాం కోసం చెడుమార్గం ద్వారా లబ్ధి పొంందాలనే యోచనతోనే నిందితులు ఇందుకు ప్రయత్నించి తమకు చిక్కినట్లు విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు పోలీసులు వివరించారు. నిందితులపై ఎక్సైజ్ యాక్టుతోపాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫొటో: ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం నిల్వలు