తెలంగాణాలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందన్నారు.
వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందని సీఎం చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు.
కాగా వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు.