కొండుభట్ల రామచంద్రమూర్తి అనే పేరు కొందరికే తెలుసు కావచ్చు. కానీ కేఆర్ మూర్తి అంటే జర్నలిస్టు లోకానికే కాదు, జర్నలిజం గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పత్రికా పాఠకులకే కాదు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన న్యూస్ ఛానళ్ల ప్రేక్షకులకూ సుపరిత నామధేయమే. జర్నలిస్టుగా, ఎడిటర్ గా, సీనియర్ ఎడిటర్ గా ‘మూర్తి గారు’ అని కొందరు ముద్దుగా సంబోధించే రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు సరే… తర్వాత పయనమెటు? ఇదీ జర్నలిస్టు సర్కిళ్లలో తాజాగా రేకెత్తుతున్న ప్రశ్న.
ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రికలకు ఆయన ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతర పరిణామాల్లో హైదరాబాద్ మీడియా హౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, హెచ్ఎంటీవీ వ్యవస్థాపక చీఫ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. హన్స్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక బాధ్యతలనూ మోశారు. తన జర్నలిజపు పయనంలో ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ గానూ పనిచేశారు. ఆయా దినపత్రికల్లో అత్యున్నత స్థాయి హోాదాలో గల అనేక మంది జర్నలిస్టులే కాదు, కొందరు ఎడిటర్లు కూడా కేఆర్ మూర్తి నేతృత్వంలో పనిచేసి ఎదిగినవారే.
తెలుగు జర్నలిజపు చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు కేటాయించేలా కీర్తిని సముపార్జించుకున్న కేఆర్ మూర్తి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీ)గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా పూర్తి కాకుండానే రామచంద్రమూర్తి తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. కేఆర్ మూర్తి రాజీనామాకు దారి తీసిన పరిణామాలు ఏమిటనేదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం.
అయితే తన రాజీనామా అనంతరం రామచంద్రమూర్తి ఓ కీలక వ్యాఖ్య చేయడం విశేషం. ‘మీడియాలో కొనసాగాలనే ఉద్ధేశంతోనే సలహాదారు పదవి నుంచి వైదొలిగాను’ అని కేఆర్ మూర్తి తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. డెబ్బయి రెండేళ్ల వయస్సు గల రామచంద్రమూర్తి రూ. లక్షల వేతనం వచ్చే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి జర్నలిజంలో కొనసాగాలనుకోవడమే అసలు విశేషం.
వాస్తవానికి ‘ప్రత్యమ్నాయం’ లేకుండా కేఆర్ మూర్తి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ హోదాకూ రాజీనామా చేయలేదనే ప్రచారం కూడా వాడుకలో ఉంది. జర్నలిస్టు వర్గాలు అందుకు పలు ఘటనలను కూడా ఉటంకిస్తుంటాయి. ఈ కోణంలో పరిశీలించినపుడు కేఆర్ మూర్తికి ప్రస్తుతం గల ప్రత్యామ్నాయం ఏమిటి? ఇదీ అసలు ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో ఏదేని కొత్త పత్రిక పుట్టుకొస్తున్నదా? ఆయా పత్రికకు ఆయన చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించననున్నారా? లేదంటే ప్రస్తుతం కొనసాగుతున్న మీడియా వ్యవస్థలోని ఏదేని సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ప్రస్తుతానికైతే జవాబు లేనట్టే.
అంతే కాదు, మరో కథనం కూడా జర్నలిస్టు సర్కిళ్లలో ప్రచారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పరంగా కేఆర్ మూర్తిని ఏదేని కీలక పదవి వరించవచ్చనేది ఈ ప్రచారపు సారాంశం. కొంత కాలం క్రితం తనకు అత్యంత సన్నిహితుడైన ఓ జర్నలిస్టుతో కలిసి ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో కేఆర్ మూర్తి గంటల తరబడి భేటీ అయ్యారనే కథనం వాడుకలో ఉంది. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ పదవిని చేపట్టడానికి ముందే ఈ పరిణామం జరిగినట్లు జర్నలిస్టు వర్గాలు ఈ సందర్భంగా చర్చించుకుంటుండడం గమనార్హం.
అయితే మూర్తి సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయంలో భిన్న కథనాన్ని వినిపిస్తున్నాయి. ఓ యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసే యోచనలో కేఆర్ మూర్తి ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రత్యామ్నాయం’ లేకుండా ప్రస్తుత హోదాను వీడరనే ప్రచారం గల కేఆర్ మూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు సరే…. What Next!? అనేది కాలమే తేల్చాలి మరి!