కరోనా మహమ్మారి తెలంగాణాలో ఓ పోలీసు ఉన్నతాధికారిని పొట్టనబెట్టుకుంది. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న దక్షిణామూర్తిని కరోనా వైరస్ కొద్ది సేపటి క్రితం బలి తీసుకుంది.
దాదాపు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన దక్షిణామూర్తి కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతూనే ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దక్షిణామూర్తి మృతి ఘటన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పోలీసు వర్గాల్లో తీరని విషాదాన్ని నింపింది.
పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగిన దక్షిణామూర్తికి కెరీర్ పరంగానేగాక, ప్రజల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సమర్థవంత పోలీసు అధికారిగా ఆయన ప్రాచుర్యం పొందారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేర్వరు హోదాల్లో ఆయన పని చేశారు.
శాంతి భద్రతల పరంగా మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గానూ విధులు నిర్వహించిన దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పని చేస్తున్నారు. దక్షిణామూర్తి మృతి పట్ల ఆయనతో అనుబంధం గల పోలీసు అధికారులు, సిబ్బందే కాదు సామాన్య ప్రజలు కూడా అత్మీయతను, అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. జ్ఞాపకాలను స్మరిస్తూ దక్షిణామూర్తికి నివాళులు అర్పిస్తున్నారు.