మన కళ్ల ముందు కనిపించే పోలీసులు వేరు. ఆమ్యామ్యాలకు ఆశపడే మరికొందరు పోలీసుల తీరు వేరు. కోట్లు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ ఏసీబీకి పట్టుబడే ఇంకొందరు పోలీసు అధికారుల వ్యవహార వైలి వేరు. పోలీసులలో చాలా విభాగాలు ఉంటాయి. కొందరు పోలీసుల కష్టం అరుదుగా మాత్రమే మన కళ్లకు కనిపిస్తుంటుంది. ఔనా…? పోలీసులు తమకు కేటాయించిన విధుల నిర్వహణలో ఇన్ని కష్టాలు పడుతుంటారా? అని నివ్వెరపోక తప్పదు ఇక్కడ గల ఓ సాహస వీడియోను చూశాక.
సాధారణంగా నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం పోలీసులు వేసవి కాలంలోనే చేస్తుంటారు. ఆకురాలే వేసవి సీజన్ లోనే నక్సలైట్ల ఆచూకీని పోలీసులు ఎక్కువగా కనిపెడుతుంటారు. పక్కా సమాాచారం ఉంటే తప్ప ఇతర సీజన్లలో నక్సలైట్ల ఆచూకీ లభ్యం కాదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. అందుకే సహజంగానే నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లకు పోలీసులు ఎక్కువగా వేసవి కాలాన్నే ఎంచుకుంటారు. అనేక గత ఘటనలే ఇందుకు నిదర్శనం.
ఇందుకు విరుద్ధంగా ఛత్తీస్ గఢ్ పోలీసులు నక్సల్స్ ఆపరేషన్లను వర్షాకాలంలోనూ చేపట్టడం గమనార్హం. ఛత్తీస్ గఢ్ లో తీవ్రవాద ప్రాబల్యం గల సుక్మా, దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్ తదితర జిల్లాల్లోని అటవీ మార్గాల్లో రహదారి సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఇక ఛత్తీస్ గఢ్ అడవుల్లో వాగులు, వంకలకు కొదువే ఉండదు. పొంగిపొర్లుతున్న వాగులు సైతం దాటుతూ ఛత్తీస్ గఢ్ డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) పోలీసులు నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లలో ఎలా పాల్గొంటున్నారో తెలిపే వీడియో దృశ్యమిది.
దంతెవాడ జిల్లా కాటేకళ్యాన్ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు వాగు దాటుతున్న సాహస చిత్రమిది. జోరు వర్షాల్లోనూ వాగులు, వంకలు దాటుకుంటూ నక్సలైట్లపై నిరంతర ఆపరేషన్ కొనసాగిస్తున్న పోలీసుల పట్టుదలను, చిత్తశుద్ధిని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రశంసించారు. అందువల్ల విషయమేమిటంటే… పోలీసు ఉద్యోగాలన్నీ ఒకే రకం కానే కాదు. కొన్ని విభాగాల్లో ఇటువంటి విధినిర్వహణ కష్టాలు కూడా ఉంటాయి మరి. ఇక వీడియో చూడండి.
ఇన్ పుట్స్: బస్తర్ కీ ఆవాజ్ సౌజన్యంతో…