ఖమ్మం జిల్లాలో కరోనా మరింత తీవ్రతరమైంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 2,549 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ఆర్ఏటీ) నిర్వహించగా, అందులో 528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈరోజు 177 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.
గడచిన మూడు రోజులుగా ఖమ్మంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈనెల 21న 385 మంది, 22న 296 మంది, 23న 232 మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ సంఖ్య ఆదివారం నాటి అంకెకు రెట్టింపును దాటి 528కి చేరుకోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటి వరకు వైరస్ భారిన పడిన బాధితుల సంఖ్య ఇదే అత్యధికం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆందోళన నెలకొంది.