లండన్ కు బస్సులో వెళ్లడమేంటి? టీఎస్ఆర్టీసీ, లేదంటే ఏపీఎస్ ఆర్టీసీ లండన్ కు ఏదేని బస్సు సర్వీసు ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నిస్తే మాత్రం అటువంటి బస్సు సర్వీసు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఆర్టీసీ సంస్థ కూడా ప్రవేశపెట్టలేదనే చెప్పాలి. మరి బస్సులో లండన్ ఎలా వెడతారు? లండన్ అంటే మన పల్లెల్లో చెప్పుకునే ‘లండన్’ కాదుగా? అని సంశయించకండి. ఇది నిజమైన లండన్ గురించే. బ్రిటన్ రాజధాని లండన్ కు బస్సు సర్వీసు గురించే ఈ వార్తా కథనం. ఎన్నెన్ని దేశాలు దాటి లండన్ వెళ్లాలి? అదెలా సాధ్యం అంటే…? సాధ్యమే అంటోంది గురుగ్రామ్ కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ.
ఔను… ఈ ట్రావెల్ సంస్థ మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసును ప్రవేశపెట్టంది. మమన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉబ్జెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు ప్రయాణిస్తుంది. మొత్తం 18 దేశాల మీదుగా డెబ్బయి రోజులపాటు దాదాపు 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. ‘బస్ టూ లండన్’ అనే పేరుతోనే అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ సంస్థ బస్సును ప్రవేశపెట్టింది.
ఈ బస్సులో ప్రయాణిస్తే వీసా అక్కర్లేదా మరి? అనే ప్రశ్నకు తావే లేదు. ఎందుకంటే ఈ బస్సులో వెళ్లేవారికి వీసా, భోజనవసతి వంటి సదుపాయాలను సంబంధిత ట్రావెల్స్ చూసుకుంటుంది. ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, అసిస్టెంట్ కూడా ఉంటారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేవలం 20 సీట్లతోనే బస్సును రూపొందించారు.
వాస్తవానికి ఢిల్లీ-టు-లండన్ బస్సు గత మే 21వ తేదీనే తన జర్నీని ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం కారణంగా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించలేదని ట్రావెల్ నిర్వాహకులు చెప్పారు. ఈ బస్సులో ప్రయాణించేవారికి మరో సౌలభ్యం కూడా ఉంది. అన్ని దేశాలు కాకుండా కోరుకున్న దేశాల వరకు కూడా ఇందులో ప్రయాణించవచ్చు.
భలే… భలే బస్సు… హాయిగా ఓ రెండు నెలలకు పైగా విహార యాత్ర చేసుకుంటూ వెళ్లొచ్చు కదూ? ఇంతకీ టికెట్ ధర ఎంత అంటే… జస్ట్ రూ. 15.00 లక్షలు. ఔను ఢిల్లీ నుంచి లండన్ వరకు వెళ్లే ఈ బస్సు టికెట్ ఖరీదు అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు మాత్రమే.