‘ఎండ్రు కాయ’ కల్చర్ అంటుంటారు తెలంగాణాలో. ఎండ్రుకాయలనే స్థానికంగా కొందరు ‘ఎండ్రుకిచ్చలు’ అని కూడా పిలుస్తుంటారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో వీటిని ‘పీతలు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా తెలంగాణాలోని ‘రెడ్డి’ సామాజిక వర్గంలో ‘ఎండ్రుకాయ’ కల్చర్ ఎక్కువ అనే ప్రచారమే కాదు, బలమైన వాదన కూడా ఉంది. ఇందుకు ఉదాహరణలు కూడా కోకొల్లలు.
ఇంతకీ ఎండ్రుకాయ కల్చర్ అంటే ఏమిటి? అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, సందర్బానుసారం మరోసారి వల్లె వేసుకుందాం. పొలం గట్ల వెంట బొరియ (రంధ్రం)లు ఉంటాయి తెలుసుగా…? అందులో ఎండ్రుకాయలు తిష్ట వేస్తాయి. ఓ ఎండ్రుకాయ బొరియ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ… అదే బొరియలో గల మిగతా ఎండ్రుకాయలు పైకి వచ్చే ఎండ్రుకాయ కాళ్లు పట్టి కిందకు లాగేస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా నిరోధిస్తుంటాయి.
తొలి ఎండ్రుకాయ బయటకు వెడితే, బొరియలోని మిగతా ఎండ్రుకాయలు కూడా బాహ్య ప్రపంచంలోకి వచ్చి తమ గమ్యాన్ని, ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ… ముందు వెళ్లే ఎండ్రుకాయను వెళ్లకుండా కిందకు లాగడమే మిగతా ఎండ్రుకాయల రీతి. తమకంటే ముందు వెళ్లరాదన్నదే బొరియలోని మిగతా ఎండ్రుకాయల భావన. ఫలితంగా ఏ ఎండ్రుకాయ కూడా బయటకు రాలేదు. అదే బొరియలో మగ్గాల్సిన అనివార్య స్థితి. దీన్నే ‘ఎండ్రుకాయ కల్చర్’ అంటుంటారు.
ఇప్పుడీ ‘ఎండ్రుకాయ కల్చర్’ కథ ప్రస్తావన దేనికంటే…? నిన్న తెలంగాణాలో చోటు చేసుకున్న ఓ ఘటన రాజకీయ కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే కదా? హైదరాబాద్ లోని బోయనపల్లిలో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న శాసన మండలి చైర్మెన్, అధికార పార్టీకి చెందిన సీనియర్ లీడర్ స్వామి గౌడ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఘటన రాజకీయంగా చర్చకు దారి తీసింది.
‘మల్కాజిగిరి ఎంపీ రేవంత్ ‘రెడ్డి’ బిడ్డ అయినప్పటికీ, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. ఆయా వర్గాలకు వెన్నుపూసగా, బలమైన చేతికర్రగా ఉపయోగపడుతున్నాడు. ఇలాంటి వారికి అండగా నిలవాలి’ అని టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ పిలుపునిచ్చారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలెవరైనా రేవంత్ పై ఈ వ్యాఖ్యలు చేస్తే అంతగా విశేషం కాకపోవచ్చు. కానీ… శాసన మండలి చైర్మెన్ గా బాధ్యతలు నిర్వహించిన స్వామి గౌడ్ వంటి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డిపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణాలో పొలిటికల్ హాట్ టాపిక్.
ఇదే సందర్భంలో రేవంత్ అంశంలో కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం గల తీరు, తెన్నులు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయట. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే సామెతనూ కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నాయట. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో గల రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్న కొందరు కాంగ్రెస్ నేతల తీరును ఆ పార్టీ శ్రేణులు ‘ఎండ్రుకాయ కల్చర్’తో పోలుస్తున్నారట. అదీ సంగతి… విషయం మీకు అర్థమైనట్లే కదా!