ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఖమ్మం నగరానికి చెందిన పలువురు వ్యాపార ప్రముఖులను కరోనా ఇప్పటికే పొట్టనబెట్టుకోగా, తాజాగా నిర్వహిస్తున్న టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ర్యాపిడ్ యాంటిజెన్ (ఆర్ఏటీ) టెస్టుల సంఖ్యను అధికారులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే టెస్టుల సంఖ్యలో దాదాపు పావు వంతు మేర పాజిటివ్ కేసులు నమోదవుతుండడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో అధికారిక నివేదికలను పరిశీలిస్తే ఇదే విషయం బోధపడుతుంది.
శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 1,658 మందికి ఆర్ఏటీ టెస్టులు నిర్వహించగా, 385 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. టెస్టులు చేసిన సంఖ్యలో నాలుగో వంతు చొప్పున పరిగణిస్తే వచ్చే సంఖ్య 414 కాగా, 385 మందికి కరోనా సోకినట్లు వెల్లడి కావడం గమనార్హం.
అదేవిధంగా శనివారం జిల్లా వ్యాప్తంగా 1,221 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 296 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇందులో పావు వంతు అంకెను పరిశీలిస్తే 305 కాగా, ఆయా అంకెకు అతి సమీపంలో పాజిటివ్ బారిన పడిన బాధితుల సంఖ్య 296గా ఉండడం గమనించదగ్గ అంశం.
జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై సంచరిస్తున్న తీరులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని అధికారగణం ఎంత మొత్తుకుంటున్నా ప్రజలు పట్టించుకుంటున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు.