పాపం ఖర్చులకు డబ్బుల్లేక చిన్నగా కక్కుర్తి.. ఇంట్లో స్టౌ మీదకు ఏం లేవు.. స్టౌ అంటే గుర్తుకొచ్చింది ఆ మాటకొస్తే ఇంట్లో స్టవ్వే లేదు.. గ్యాస్ స్టౌ పక్కన పెట్టు కిరోసిన్ స్టౌ కూడా గతికి లేదు. పొయ్యి మీదకు ఏమీ లేక మస్తిష్కం విపరీత ఆలోచన చేసింది. తన ప్రమేయం లేకుండా మెదడు పనిచేస్తే ఎవరి తప్పు? బుద్ధి గడ్డికి బదులు డబ్బు తింటానంటే ఎవరు బాధ్యులు?
నాలుగు రోజులుగా నకనకలాడే కడుపులతో భార్య, పిల్లలు.. అసలే కరోనా టైం.. ఎవరినీ ఏమీ అడుగలేని పరిస్థితి.. చేబదులుకు తెచ్చీ తెచ్చీ అప్పులు ఎక్కువయ్యాయి.. మళ్లీ అడిగితే ఏమనుకుంటారోనని కాలే కడుపులతో, రాని కన్నీళ్లతో కుమిలికుమిలి దుప్పటి కప్పుకుని పడుకునే దౌర్భాగ్యం.
చదివిన చదువేంటి.. చేస్తున్న ఉద్యోగం ఏంటి..? తల్లిదండ్రులు కడుపు కాల్చుకుని విద్యా బుద్ధులు చెప్పిస్తే, తాను మాత్రం కడుపున పుట్టిన వారికి పంచభక్ష్య పరమాన్నాలు పక్కన బెట్టు, కనీసం పప్పు నీళ్లతోనైనా నాలుగు ముద్దలు పెట్టలేకపోతున్నాననే బాధ..
అందుకే నాగన్న.. నట విశ్వరూపం బయటపెట్టాడు.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు.. ఎవరైనా పనికోసం వస్తే తన పనైన రాళ్లు వెనకేసుకునుడు మర్చిపోకుండా చేసుకుంటున్నడు. ఎవరైతేనేమీ.. వచ్చే వాళ్లు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులైతేనేమీ తను మాత్రం తగ్గదల్చుకోలేదు.. తన గురించి ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్తే మాత్రం ఎవరేమీ చేస్తారులే అని ధైర్యాన్ని కూడగట్టుకుని పనిని చక్కబెట్టుకుంటూనే ఉన్నాడు..
ఎంత సేపు చిన్నాచితక వసూళ్లు..? కోడ్తే.. లైఫ్ సెట్ అయిపోవాలనుకున్నాడు.. ఆఫ్కోర్స్ ఇప్పటికే మనోడు కోట్లు వెనకేసి సెట్ అయ్యాడులే గానీ.. ఎంత కష్టపడకపోతే మాత్రం ఆ స్థాయి అధికారి ఆస్తులు 150 కోట్ల రూపాయలైతయ్.. బాగా శ్రమించాడు.. డబ్బులు గుంజేటప్పుడు ఎవరు చూస్తారో.. ఎలా జాగ్రత్త పడాలో అని చెమటలు కక్కిండు… ఎక్కడ పని చేసిన తన చేతివాటం చూపందే నిద్రపోని ఆ సారు ఇప్పుడు కూడా చేతివాటం చూపే క్రమంలో పాపం దొరికిపోయాడు.
అయినా, ఏసీబీకి దొరికిన తర్వాత ఏవేవో ఉంటాయి కదా.. చట్టాలు, నియమాలు, నిబంధనలు, వంకాయ, తోటకూర వగైరా, వగైరాలన్నీ ఆసాంతం చదివిన నాగ సారులాంటి వారికి ఇదేమీ పెద్ద తప్పు అనిపించదు.. ఇప్పటితో ఆపేయాలని అనిపించేలా చేయదు.. ఎందరు నాగాలను చూడలేదు.. ఎన్ని నగదులు పట్టుబడగా చదువలేదు.. ఇప్పుడో నాగ దొరికాడు.. నాలుగు రోజులు ‘నాగ’ టైం పాస్ చేస్తాడు.. ఆ తర్వాత నాగ ది హీరో.. నాగ ది రోల్ మోడల్.. నాగ ది ఎక్స్.. వై.. జెడ్..
చివరగా నాగ ‘ది బుస్..’ నాటకం సమాప్తం.. కథ అంతం..
– హే….. మిటో…………
✍️ ఆర్పీSEEహెచ్
(ఫేస్ బుక్ వాల్ నుంచి…)