‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యెట్టి
అపర విష్ణుడవీవు
తెలగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ కల్వకుంట్ల
క్షీరాబ్ధి చంద్రమా
శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా
విజయోస్తు’’
సాహితీవేత్త తిరునగరి రామానుజం రాసిన పద్యమిది. మహాకవి దాశరథి పురస్కారం – 2020ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో రామానుజానికి అందించారు. శాలువా కప్పి ఆయనను సన్మానించారు. జ్ఞాపికతోపాటు రూ.1,01,116 నగదు పురస్కారం కూడా సీఎం అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై రామానుజం ఆయా పద్యాన్ని రాసి, పాడి వినిపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని అన్నారు.
రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు. రామానుజం మరిన్న రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.