తెలంగాణా సీఎం కేసీఆర్ సార్ రెవెన్యూ శాఖను రద్దు చేస్తానని పదే పదే ఎందుకు చెబుతుంటారు…? ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని ఆయన ఎందుకు భావిస్తున్నారు? రెవెన్యూ శాఖ పనితీరుపై బహుషా కేసీఆర్ కు ఉన్నంత అవగాహన, స్పష్టత మరెవరికీ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు రెవెన్యూ శాఖపై సీఎం కేసీఆర్ యోచన సముచితమనే భావన గోచరిస్తుంది. రెవెన్యూ శాఖకు ‘రద్దు’ శాస్తి జరగాల్సిందేనని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే… ఇక్కడ గల వీడియోను తీక్షణంగా పరిశీలించండి.
చూశారుగా…? అన్నీ రూ. 500 నోట్ల కట్టలే. ఓ టేబుల్ పై వరుసగా పేర్చిన కరెన్సీ నోట్ల కట్టల ప్రదర్శన కాదిది. ఆ మొత్తం ‘చిల్లర’ యవ్వారం కూడా కాదు. చాలా ఖరీదైన బాగోతం. పదీ, పరకా సంగతి కాదు… ఏకంగా రూ. 1.10 కోట్లు. అక్షరాలా కోటి పది లక్షల రూపాయల అవినీతి ముచ్చట మాట. ఓ రెండు కోట్లకు ‘బేరం’ కుదుర్చుకున్న ఘటనలో తొలి చెల్లింపుగా అందుకున్న అమ్యామ్యా అన్నమాట.
హైదరాబాద్ నగరంలోనే కలిసినట్లు ఉండే మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు ఓ భూదందాలో ఆయా మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు నిన్న రాత్రి పొద్దుపోయాక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలు విశేషం ఏమిటంటే… బాధితులెవరూ ఫిర్యాదు చేయకుండానే ఏసీబీ విభాగం తహశీల్దార్ నాగరాజు అవినీతి బాగోతంపై ఓ కన్నేసి పట్టుకోవడం.
కీసర మండలం రాంపల్లిలోని ఓ భూమిని అప్పనంగా హస్తగతం చేసుకునేందుకు జరిగిన అక్రమ లావాదేవీల్లో తహశీల్దార్ అవినీతి బాగోతమిది. ఓ పార్టీకి చెందిన ‘లీడర్’కూ ఇందులో భాగస్వామ్యం ఉందట. అతని అనుచరుడు అంజిరెడ్డి, ఉప్పల్ కు చెందిన దళారి శ్రీనాధ్ ఈ భూముల వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను తీసుకున్నారట.
తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసి పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహశీల్దార్ భారీ మొత్తానికే బేరం కుదుర్చుకున్నాడు. మొత్తం రూ. 2.00 కోట్లకు అవినీతి ఒప్పందం జరగ్గా, మొదటి చెల్లింపు కింద రూ. 1.10 కోట్లు తహశీల్దార్ నాగరాజు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ భారీ అవినీతి సొమ్ము పట్టుబడిన ఘటన సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో తహశీల్దార్ ఇంట్లో మరో రూ. 25 లక్షలు కూడా దొరికడం గమనార్హం. తహశీల్దార్ నాగారాజును, మరో ఇద్దరిని, వీఆర్ఏ సాయిరాజ్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏసీబీ అధికారులకు చిక్కిన తహశీల్దార్ నాగరాజు గత చరిత్ర కూడా ఘనమనే వార్తలు వస్తున్నాయి. ఇతని అవినీతి వేధింపులు తట్టుకోలేక ఓ రైతు పురుగు మందు తాగి అత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా ఉన్నట్లు ఆయా వార్తల సారాంశం. టైపిస్టుగా రెవెన్యూ శాఖలో కెరీర్ ప్రారంభించిన నాగరాజు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలోనూ పట్టుబడ్డాడు. తన రాజకీయ పలుకుబడితో ఆయా కేసులనుంచి బయటపడినట్లు సమాచారం.
కొసమెరుపు ఏమింటంటే… కీసర తహశీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్ల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ పట్టుబడిన ఘటనపై సీఎం కార్యాలయం సీరియస్ గా ఉందట. రెవెన్యూ శాఖపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కీసర తహశీల్దార్ అవినీతి ఘటనను ఉదహరిస్తూ ప్రముఖ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి… రెవెన్యూ శాఖపై సీఎం కేసీఆర్ కు సదభిప్రాయం లేకపోవడం సముచితమే కదా!
ఫొటో: కీసర తహశీల్దార్ నాగరాజు