కరోనా నియంత్రణకు రష్యా ప్రకటించిన తొలి వ్యాక్సిన్ కు ప్రపంచ దేశాలు ముందస్తు క్యూ కడుతున్నాయి. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను రష్యా ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన కూతురుకు తొలి వ్యాక్సిన్ డోసు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కు ‘స్పుత్నిక్-వి’ పేరుతో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి,
వచ్చే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్న ఈ వ్యాక్సిన్ కు వివిధ దేశాల నుంచి భారీ ఇండెంట్ వస్తున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధినేత కిరిల్ డిమిత్రియేవ్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 20 దేశాలు బిలియన్ డోసులకంటే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ కోసం ప్రి-ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు. ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ బుధవారం నుంచి ప్రారంభమవుతాయని కూడా ఆయన చెప్పారు.