తెలంగాణాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన జర్నలిస్టుల సంఖ్య ఎంతో తెలుసా? ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రాచుర్యం పొందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులుగా మారినట్లు అధికారికంగా వెల్లడైంది.
కరోనా బాధితులుగా అడపా దడపా వార్తల్లోకి వస్తున్న జర్నలిస్టుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది జర్నలిస్టులు కోలుకున్నట్లు మీడియా అకాడమీ లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణాలో 442 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడినట్లు మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ ప్రకటించారు. వీరందరికీ రూ. 80 లక్షల ఆర్థిక సాయం అందించామని, కరోనా చికిత్స కోసం ఆయా మొత్తాన్ని సంబంధిత జర్నలిస్టుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.