ఈ శల్య సారధ్యం గురించి చాలామందికి తెలుసు. ద్రోహానికి ప్రతిపదంగా ఇది బాగా ప్రచారంలో ఉంది. అంటే మన పక్కనే ఉంటూ మనను తప్పుదోవ పట్టించడం, మనలో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రవర్తించడం వంటి చర్యలకు ఈ “శల్య సారధ్యం” ఉపయోగిస్తున్నాం.
వాస్తవానికి శల్యుడు శక్తివంతమైన రాజు. యుద్ధంలో మంచి వ్యూహాత్మకంగా పోరాడే శక్తి కలవాడు. శత్రువుల కదలికలను బట్టి తన కదలికలను నిర్దేశించుకుని పోరాటం చేయగలిగిన దిట్ట. స్వతహాగా మంచి రథసారధి కూడా. పాండవులకు మేనమామ.
శకుని కుట్రలో భాగంగా ధర్మరాజు వేషంలో వెళ్ళిన దుర్యోధనుడు శల్యుడికీ, అతడి సైన్యానికి మంచి విందు ఇచ్చి యుద్ధంలో తన తరఫున పోరాటం చేసేందుకు హామీ పొందుతాడు. తర్వాత అతడు ధర్మరాజు కాదని, దుర్యోధనుడు అని తెలిసినప్పటికీ ఇచ్చిన మాట కాదనలేక కురుసేన తరపున పోరాటం చేస్తాడు.
భీష్ముడి నాయకత్వంలో యుద్ధం జరుగుతున్నప్పుడు తన సేనలను, కర్ణుడి నేతృత్వంలో యుద్ధం జరుగుతున్నప్పుడు తాను కర్ణుడి రథసారధిగా చివరికి కర్ణుడి మరణానంతరం యుద్ధం ముగిసే వరకు కౌరవ సేనకు సైన్యాధ్యక్షుడిగా శల్యుడు పనిచేస్తాడు.
అయితే కర్ణుడికి రథసారధిగా ఉన్నప్పుడు కర్ణుడి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కర్ణుడిని తక్కువ చేస్తూ, అవమానిస్తూ, పాండవులను గొప్పగా ప్రశంసిస్తూ ఉంటాడు.
కర్ణుడి రథం నడుపుతూనే కర్ణుడి స్థైర్యాన్ని బలహీనపర్చడం. అంటే మనతోనే ఉంటూ మన ఓటమికి పని చేయడం అన్నమాట.
ఇలాంటి శల్య సారధ్యం మనం ఇప్పటికీ నిత్యజీవితంలో చూస్తూనే ఉంటాం.
ఇలాంటి శల్యులు మన మిత్రులు గానో, సహచరులు గానో, సన్నిహితులు గానో అనేక రూపాల్లో ఉంటారు.
ఇలాంటి శల్యులు మన ఆఫీసులో ఉండొచ్చు. మన ఇంట్లో కూడా ఉండొచ్చు.
మన పక్కనే ఉండి మన వైఫల్యం కోసం పనిచేస్తూ ఉంటారు.
మనతోనే ఉండి మన పతనం కోసం, మన ఫెయిల్యూర్ కోసం పనిచేస్తూ ఉంటారు.
ఇది శల్యుల కాలం.
✍️ గోపి దారా