మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. మాటలే కదా…? పోయేదేముంది? కానీ చేతల్లో చూపడమే కష్టమవుతుంది. అందుకే మాటలు చెప్పడం కాదు… చేతల్లో చూపాలి అని చెబుతుంటారు. హరిత హారం ద్వారానే కరోనా మటుమాయమవుతుందని, వైరస్ గొంతు నుంచి కడుపుల బడితే కింద నుంచి బయటకు పోతుందని రకరకాల నిర్వచనాలు చెప్పిన అనేక మంది నాయకులను చూశాం. వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఘటనలూ సాక్షాత్కరిస్తున్నాయి. కరోనాపై తమదైన శైలిలో నిర్వచనం చెప్పిన నాయకుల్లో కొందరు తమకు వైరస్ సోకిందే తడవుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతీ తెలిసిందే.
కానీ కర్నాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మాత్రం కరోనా రోగులకు భరోసా కల్పించే దిశగా పయనించడమే విశేషం. ఇందులో భాగంగానే కరోనా బారిన పడ్డ మంత్రి శ్రీరాములు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించిన శ్రీరాములు చికిత్స కోసం బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కుర్జాన్ సర్కార్ అసుపత్రిలో చేరారు. కరోనా సోకిన కర్నాటకకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు చికిత్సకై ప్రైవేట్ ఆసుపత్రులకు వెడుతుండగా, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు మాత్రం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఉదంతం సహజంగానే చర్చనీయాంశమైంది.