తెలుగు మీడియాలో ‘ఈనాడు’ దినపత్రిక శైలే వేరు. పాత్రికేయ రంగంలో రకరకాల ప్రయోగాలకు పెట్టింది పేరు. సందర్భానుసారం సారా నిషేధ ఉద్యమాలకు ఊతమిచ్చినా, పత్రికా భాషకు పరిమితులు లేవంటూ గ్రాంథిక భాషను వ్యవహారిక పదాల్లోకి మార్చినా, తెలుగు పేరుతో వాడుక పదాలను సైతం పాఠకుని బుర్రకు పనిచెప్పే విధంగా అచ్చ తెలుగులోకి అనువదించినా ఈనాడు శైలి ప్రతిసారీ చర్చనీయాంశమే. ఇదిగో ఈ బాటలోనే ఈనాడు యాజమాన్యం తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ‘డబుల్’ ధమాకా తరహా బాధ్యతలను అప్పగించడమే తెలుగు మీడియాలో తాజా సంచలనం.
కరోనా కల్లోల పరిణామాల్లో పలువురు ఉద్యోగులను ఇంటిబాట పట్టించడం, ఇంకొందరికి ‘డ్యూటీ చార్ట్’ ప్రకారం వేతనాలు చెల్లించడం వంటి అనేక పరిణామాలు తెలుగు మీడియాలో బహిరంగమే. ఆయా పరిణామాల్లో ఈనాడు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పలు ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈనాడు సంస్థలో వార్తలు సేకరించే పాత్రికేయులు ‘అవధానం’ తరహా పాత్రలు పోషిస్తున్నారు. ఈనాడు దినపత్రికకు, ఈటీవీకి, ఈటీవీ భారత్ కు, ఈనాడు నెట్ వ్యవస్థలకు ఒకే వ్యక్తి వార్తలు పంపడం ఇందులో భాగమే.
ఈ పరిణామ క్రమంలో ఈనాడు మరో సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టడమే అసలు విశేషం. సాధారణంగా ఇప్పటి వరకు ఈనాడు దినపత్రికకు, ఈటీవీకి వేర్వేరుగా స్టాఫ్ రిపోర్టర్లను నియమించి విధులు కేటాయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు వేర్వేరుగా స్టాఫ్ రిపోర్టర్లు ఉండేవారు. కానీ ఇటీవల ఈ రెండు విభాగాల సంస్థల విధులను ఒకరికే కేటాయిస్తూ బాధ్యతలు అప్పగించడం విశేషం. అంటే ఈనాడు దినపత్రికు, ఈటీవీకి ఒకే స్టాఫ్ రిపోర్టర్ విధులు నిర్వహించాలన్నమాట. ఒకే ఉద్యోగి రెండు ఉద్యోగాల భారాన్ని మోయాలన్న మాట.
తెలంగాణాలోని ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనేగాక ఆంధ్రప్రదేశ్ లోని మరో మూడు జిల్లాల్లో ఇటువంటి సరికొత్త ‘ప్రయోగాన్ని’ ఈనాడు సంస్థ తాజాగా అమలు చేస్తోంది. ఆయా జిల్లాల్లో ఈనాడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్లను ఇతర విభాగాల్లోకి బదిలీ చేసి, ఈటీవీ స్టాఫ్ రిపోర్టర్లకే పత్రికా స్టాఫర్ విధుల బాధ్యతలను కూడా అప్పగించడం గమనార్హం. ఈనాడు వ్యవస్థలో రిపోర్టింగ్ నుంచి డెస్కుకు, డెస్కు నుంచి రిపోర్టింగ్ విభాగానికి జర్నలిస్టుల బదిలీలు సర్వసాధారణం. ఈనాడు జర్నలిజం స్కూల్లోనే వీరికి ‘ఉభయ చర’ జీవుల తరహా పాఠాలు బోధిస్తూ శిక్షణ ఇస్తుంటారు కూడా.
కానీ ఒకే వ్యక్తితో రెండు ఉద్యోగాలు చేయించే సరికొత్త ప్రయోగానికి ఈనాడు యాజమాన్యం శ్రీకారం చుట్టడమే పాత్రికేయవర్గాల్లో చర్చకు దారి తీసింది. తమకు సంస్థ రెండు ఉద్యోగాలు ఇచ్చినందుకు సంతోషపడాలో, ఒకే వేతనానికి రెండు ఉద్యోగాల భారం మోస్తున్నందుకు చింతించాలో తెలియక ప్రస్తుతం ‘డబుల్ ధమాకా’ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగ వర్గాలు సంశయాన్ని ఎదుర్కుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా కల్లోలంలో ఈనాడు మోపిన అదనపు భారం మోయలేక ఉద్యోగులతో స్వచ్ఛందంగా రాజీనామా చేయించే దిశగా ఈ ‘డబుల్ ధమాకా’ ప్రయోగాన్ని అమలు చేస్తున్నదా? ఆర్థిక భారాన్ని తగ్గించుకునే యత్నంలో వారికి పొమ్మనలేక పొగ పెడతున్నదా? అనే సందేహాలు కూడా ఈ సందర్భంగా జర్నలిస్టు సర్కిళ్లలో వ్యక్తమవుతున్నాయి.